పాజిటివ్ వోటుపై ద్రుష్టిపెట్టని పార్టీలు

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఎన్నికలంటేనే నిర్దిష్టమైన హామీలు..స్పష్టమైన ప్రామిసెస్. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలుపొందితే తాము చేయబోయే పనులు..అమలు చేసే హామీల గురించి చెప్పటం పరిపాటి. గత అసెంబ్లీ ఎన్నికల్లోను అన్ని పార్టీలు వారి వారి ఏజెండాల‌ను ప్రకటించాయి. తెలంగాణలో తమ ప్రభుత్వాలు పవర్ లోకి వస్తే ఏమేం చేస్తాయో వివరించాయి. ఎలక్షన్ మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల రుణక్షేత్రంలోనికి దిగాయి. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇలాగే అప్పట్లో కాంగ్రెస్,బీఆర్ఎస్ కూడా ప్రజలకు నిర్దిష్టమైన హామీలే ఇచ్చాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే..లోక్ స‌భ ఎల‌క్ష‌న్స్ లో మాత్రం దాట‌వేత ధోర‌ణినే అవ‌లంభించాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు ప్రదర్శించినప్పటికీని..ఆయా పార్టీల తరఫున నిర్దిష్టమైన హామీలను ఇవ్వడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాయి. కేవలం స్థానిక అంశాల్ని ప్ర‌యార్టీగా తీసుకొని క్యాంపెయిన్ ముగించేశాయి.బిజెపి,కాంగ్రెస్,బీఆర్ఎస్‌ల‌ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు గెలిస్తే తెలంగాణకు తమ పార్టీల తరఫున ఒనగూర్చే ప్రయోజనమేందనే అంశంపై ఈ మూడు ప్ర‌ధాన పార్టీలు ఒక స్పష్టతనివ్వలేకపోయాయి. వాస్తవానికి అనేక సమస్యలు రాష్ట్రంలో తిష్ట వేశాయి. కాళేశ్వరం ఎత్తిపోతల వ్య‌వ‌హారం,విద్యుత్ కొనుగోలు, కొత్త రైల్వే లైన్లు, రహదారుల నిర్మాణం,విద్యా వ్యవస్థలో మార్పులు,నయీమ్ ఆస్తుల చిట్టా,ఓఆర్ఆర్ టెండ‌ర్ల గోల్ మాల్‌,ప్రభుత్వ భూములు అమ్మకాలు వంటి అంశాలపై ఏ పార్టీలు కూడా తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రధానంగా రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఎంచుకొని బిజెపిపై విమర్శనాస్త్రాలను సంధించింది. బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తోందనే క్యాంపెయిన్ పబ్లిక్ లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగింది. దీంతో పాటు ఎలక్షన్స్ పూర్తికాగానే అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరే ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చింది. అయితే ఇంతకుమించి ఆ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ లేకపోవడం గమనార్హం.ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే బిజెపి మాత్రం రిజర్వేషన్ల రద్దు అంశంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని చాలా బలంగా తిప్పికొట్టేందుకే ప్రయార్టీని ఇచ్చింది. తెలంగాణ నుంచి మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకుంటే రాష్ట్రానికి బిజెపి ఏం చేస్తుందనేది మాత్రం చెప్పలేకపోయింది. కేంద్రంలో బిజెపి సర్కార్ మూడోసారి కొలువు తీరితే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎలాంటి పనులు చేస్తుందనేది వివరించలేకపోయింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇదే ధోరణిని అవలంభించింది. మెజార్టీ బిఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో తాము చక్రం తిప్పుతామని చెప్పుకొచ్చింది. అంతేకాక రైతు శ్రేయస్సు విషయంలో కొత్తగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి పనులు చేయిస్తామని ప్రచారం చేసుకొచ్చింది. మొత్తంగా మూడు కీలక రాజకీయ పార్టీలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో పబ్లిక్ అక్కరకొచ్చే హామీలు, ఏం ఇవ్వ‌లేక‌పోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *