పిఠాపురంలో పవన్ ఇల్లు, ఆఫీసు పనులు ప్రారంభం

సిరా న్యూస్,కాకినాడ;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. ఈ స్థలంలో త్వరలోనే ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు. ఎన్నికల సమయంలో..పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ అన్నారు. ఈ మాట మేరకు జులైలో పిఠాపురం నియోజకవర్గంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో గతంలో 1.44, 2.08 ఎకరాల స్థలం కొన్నారు. తాజాగా ఈ ప్రాంతంలోనే మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు.ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 13, 28, 29 పరిధిలో 12 ఎకరాలను పవన్‌ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవన్… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు. తాజాగా పిఠాపురంలో అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్‌ అమోదం తెలిపింది.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలు, మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, పిఠాపురం ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం ‘పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా)’ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్థలంలో తన నివాస గృహంతో పాటు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలన్నది పవన్ ఆకాంక్షగా అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే మేము పిఠాపురం ఎమ్మేల్యే గారి తాలూకా అంటూ క్యాప్షన్ క్రియేట్ చేసిన పిఠాపురం వాసులు, పవన్ తన మకాం అక్కడికే మారిస్తే, మా నియోజకవర్గానికి తిరుగు లేదు.. ఎదురులేదంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఇటీవల ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు నియోజకవర్గంలో పవన్ శంఖుస్థాపన చేశారు. అంతేకాదు ప్రతి పాఠశాల, వైద్యశాల ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్య తన దృష్టికి వచ్చినా స్వంత నిధులను కూడా వెచ్చిస్తున్నారట పవన్. అందుకేనేమో రావయ్యా.. రావయ్యా.. పవన్ అంటూ వారందరూ స్వాగతం పలుకుతున్నారు. వీరి కోరిక తీరే సమయం ఎప్పుడో మరి!పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల బాగోగులు, వారి జీవన స్థితిగతులు మెరుగుపరిచి పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరా భూమి ధర మార్కెట్ విలువ 16 లక్షలు వరకు పలుకుతోంది. తాజాగా ఆయన మరో 12 ఎకరాలు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ భూమి విలువ ఎకరా 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ 12 ఎకరాల ధర రెండు కోట్ల 40 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే పవన్ భూమి కొనుగోలు నేపథ్యంలో.. ఇతర జనసేన నేతలు సైతం అక్కడ భూముల పై పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. దీంతో పిఠాపురంలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు సైతం ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *