సిరాన్యూస్, ఆదిలాబాద్
కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వీలీనమైన కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కాలనీలో మరమ్మతులు చేపడుతున్న నీటి పైప్ లైన్ పనులను పరిశీలించారు. అంతకుముందు బస్తీ దవఖాన ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా దవఖాన లో రిజిస్టర్ లను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వీరితోపాటు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.