సిరా న్యూస్, జైనథ్
సమస్యను పరిష్కరించేందుకు కృషి
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
* పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
గ్రామాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్న తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద గ్రామస్తులకు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు తమకు ఓట్లు రాని గ్రామాలను, ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ వారిపై కక్ష సాధింపు చర్యలుగా అభివృద్ధి పనులు అన్నిటిని నిలిపివేసిన ఆచారం ఉండేదని తెలిపారు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఓటు వేసినా గ్రామం ఓటు వేయని గ్రామం రెండు వేరు కాకూడదని చెప్పారు. ఎమ్మెల్యే మొత్తం నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉంటూ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కానీ గత పాలకులు ఈ మాటను విస్మరించి ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతోందని చెప్పారు. ఈ పనులకు గాను పరిపాలన అనుమతులు వచ్చేశాయని, ఈ పనులన్నీ కూడా మార్చి నెలలో పూర్తయ్యే విధంగా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో సన్నీ, మోహన్, ముకుంద రవు, శ్రీకాంత్, అడెల్లు, ప్రభాకర్, శ్రీనివాస్, లాలా మున్న, వేద వ్యాస్, నాయకులు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.