సిరా న్యూస్, ఆదిలాబాద్:
Payal shankar birthday: ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు..
– కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కిటకిటలాడిన క్యాంపు కార్యాలయం
– రక్తదాన శిబిరానికి భారీ స్పందన
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలకు తరలివచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే స్వయంగా కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి, అభిమానులతో సంబరాలు జరుపుకున్నారు. ఉదయం పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా దుర్గా మాత, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి, సంబరాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, బీసీ సంఘం ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, నాయకులు ఆయనకు బొకేలు, పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
రక్తదాన శిబిరానికి భారీ స్పందన…
ఎమ్మెల్యే పాయల్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. రిమ్స్ ఆస్పత్రిలో పేదల కోసం స్వచ్ఛందంగా రక్తదానం అందించి కార్యకర్తలు ఎమ్మెల్యే పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, రక్తదానం చేసిన దాతలు అందరికీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.