Payal Stunning Speech: అసెంబ్లీలో అదరగొట్టిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

అసెంబ్లీలో అదరగొట్టిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్…

+ ‘విద్యుత్‌’పై ప్రశ్నల వర్షం
+ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై స్పష్టమై హామీకి డిమాండ్‌
+ స్పీచ్‌కు ఫిదా అయిన అభిమానులు
+ దటీజ్‌ పాయల్‌ శంకర్‌ అంటున్న బీజేపీ శ్రేణులు

అసెంబ్లీలో మాట్లాడాలంటే కొత్త ఎమ్మెల్యేలు భయపడటం సాధారణం. సీనియర్లు సైతం ఒకటి రెండు సార్లు ఆలోచించి, ఆచి తూచి ప్రశ్నలు సందిస్తుంటారు. అయితే మొదటి సారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన, ఆదిలాబాద్‌ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాత్రం అసెంబ్లీలో తన స్పీచ్‌తో అదరగొట్టారు. గురువారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ రంగంపై చర్చ సమయంలో ఎక్కడ తడబడ కుండా, సూటిగా ప్రశ్నలు సందించిన తీరు అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు సైతం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అసెంబ్లీలో స్పీచ్‌కు ఫిదా అవుతున్నారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఎప్పటినుంచి?
అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని చెప్పి, మోసం చేసిందన్నారు. కరెంట్‌ బిల్లు 100 యూనిట్లు దాటి ఒక్క యూనిట్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం 101 యూనిట్లకు బిల్లుల వేసారని ధ్వజమెత్తారు. వాస్తవానికి 100 యూనిట్ల వరకు మాఫీ చేసి, మిగిలిన 1 యూనిట్‌కు మాత్రమే బిల్లు వేయాల్సి ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 100 యూనిట్లు దాటిందనే సాకుతో, పూర్తి బిల్లులు వసూలు చేసిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రేస్‌ ప్రభుత్వం ఇప్పుడు ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేసారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తే, రాష్ట్రంలోని 95 లక్షల కుటుంబాలకు నెలకు రూ. 8820 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన లెక్కలు చెప్పారు. ఈ ఖర్చు ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఇస్తుందా? లేదంటే గత ప్రభుత్వం లాగానే విద్యుత్‌ సంస్థలను అప్పుల పాలు చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఏనాడు కూడ 24గంటల ఉచిత విద్యుత్‌ అందలేదని కుండబద్దలు కొట్టారు.

మోడీ సర్కార్‌తోనే రాష్ట్రంలో మెరుగైన విద్యుత్‌…
ప్రస్తుత కాంగ్రేస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం గురించి ఎక్కడ కూడ ప్రస్తావించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే తెలంగాణలో విద్యుత్‌ సంస్థలు నిరంతర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన అన్నారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి కేవలం 15 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షి ప్రస్తావించారని ఆయన గుర్తు చేసారు. అయితే బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.

25 ఏండ్లకు అధ్యక్షా… అనే అవకాశం


గత 25 ఏండ్లుగా ప్రజా క్షేత్రంలో ఉన్న తనకు ఇప్పటికీ అధ్యక్షా… అని అసెంబ్లీలో సంబోధించే గొప్ప అవకాశం దక్కిందని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. ప్రజా క్షేత్రంలో ఉంటూ సుదీర్ఘంగా ప్రజల పక్షానా పోరాడానని, నేడు ఆదిలాబాద్‌ ప్రజల ఆశీర్వాదం, బీజేపీ పెద్దల సహాకారంతోనే అసెంబ్లీలో అధ్యాక్షా అని మాట్లాడే అవకాశం దక్కిందని చెబుతూ.. అనందంతో చిరునవ్వులు చిందించారు. అటు పాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కడిపారేస్తూనే… ఇటు కొత్త కాంగ్రేస్‌ ప్రభుత్వానికి చురకలంటించిన తీరు, ఆదిలాబాద్‌ ప్రజలను ఆకట్టుకుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నంత సేపు ఎంతో ధైర్యంగా, ముక్కుసూటిగా, హుందాగా వ్యవహరించడం అందరిని కట్టిపడేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *