నకిలీ విత్తానాలు అమ్మితే పీడీయాక్ట్

సిరా న్యూస్,ఖమ్మం జిల్లా;
నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నేడు నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీ లు, విత్తన డిస్ట్రిబ్యూటర్ లతో కలెక్టర్ అవగాహన, సమాయత్తపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు డీలర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రటించవద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కృత్రిమంగా సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని అన్నారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రశీదు తప్పకుండా ఇవ్వాలని, రశీదులో రైతు పేరు, ఏ విత్తన కంపెనీ తదితర అన్ని వివరాలు వ్రాయాలని, రైతు నుండి సంతకం తీసుకోవాలని అన్నారు. విత్తనాల స్టాక్ షాపులోకి రాగానే ఇన్వాయిస్ బిల్లులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపాలని, రిజిస్టర్లు నిర్వహించాలని అన్నారు. గత సంవత్సరం విత్తనాలు, పురుగు మందులు ఏవైనా నిల్వలు ఉంటే, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే బాధ్యత, రైతులకు అట్టి విశ్వాసం కల్గించే వ్యవసాయ అధికారులదే నని ఆయన తెలిపారు. జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదని, 5.25 లక్షల ప్యాకెట్లు అవసరం ఉండగా, 5.60 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక బ్రాండ్ మంచిదని రైతుల్లో ప్రచారం చేయకూడదని, రైతులకు మంచి సలహాలు ఇవ్వాలని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వాడకంపై అవగాహన కల్గించాలని అన్నారు. లైసెన్స్ సస్పెండ్ అయిన వారు, వేరే వారి పేరుపై లైసెన్స్ తీసుకొని షాపులు నడిపితే చర్యలు చేపట్టాలని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టాలని ఆయన తెలిపారు. కాటన్ బిజీ3 కి వెళ్ళొద్దని, ఇట్టి రకాన్ని దేశంలో నిషేధించారని, రైతులు మోసపోకుండా చూడాలన్నారు. నెల రోజుల వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల విషయంలో జిల్లాలో గత 10 సంవత్సరాల్లో 50 కేసులు నమోదైనట్లు తెలిపారు. సరియైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్లతో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని అన్నారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారి సమాచారం అందించాలని అన్నారు. విత్తన డీలర్లు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలన్నారు. నకిలీ విత్తనాలతో రైతులకు ఆర్థికంగా, శ్రమ పరంగా ఎంతో ప్రభావం చూపుతుందని, ఇది వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు తెస్తుందని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *