PDSU KUTHATI RANAPRATAP: రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

సిరాన్యూస్‌, కరీంనగర్
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
* శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి 200 కోట్లు ఇవ్వాలి
* పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణాప్రతాప్‌

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి 7.31శాతం నిధులు కేటాయించడం సిగ్గుచేటని పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రానా ప్రతాప్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మాట్లాడిన కూడా, మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చిన వీటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిస్థాయి ప్రక్షాళన చేయడానికి సుమారు 500 కోట్లకు పైగా ఖర్చవుతుందని మేధావులు, విద్యావేత్తలు ముఖ్యమంత్రి కి సూచించారని కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు కలిపి వాటి అభివృద్ధి పేరిట కేటాయించిన 500 కోట్లు ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో ఆ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యకు 30శాతం నిధులు కేటాయించాలని, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలను కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి,నిరుద్యోగుల ఆందోళనలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షు లు కెమ్మసారం రవితేజ, జిల్లా సహాయ కార్యదర్శి కోనేటి అనిల్, జిల్లా నాయకులు కొయ్యడ రాకేష్, ఎండీ సోను, మిడిదొడ్డి అజయ్, శ్రీనివాస్, ప్రవీణ్, ఎండీ అస్లం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *