PHC Construction: నిర్మాణంలోనే పీహెచ్ సీ.. పట్టించుకునే వారేరీ

చిగురుమామిడి, సిరా న్యూస్ 

ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేక అవస్థలు 

నిర్మాణం పూర్తి కాని వైనం 

త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తుల వేడుకోలు 

చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో గ్రామస్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పీహెచ్ సీ నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రూ. 16 లక్షలతో నిర్మాణం ప్రారంభించినా అది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో గ్రామపంచాయతీలోనే ఆరోగ్య కేంద్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో వైద్య సేవలు సరిగా అందడం లేదు.

రెండు సంవత్సరాలుగా..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు రెండేళ్ల క్రితమే అప్పటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించినా నిర్మాణం ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లకష్యమో అధికారుల వైఫల్యమో కానీ పీహెచ్ సీ నిర్మాణం విషయంలో ఎవరు చొరవ చూపడం లేదు. దీంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వైద్య సేవలు సరైన రీతిలో అందక హుస్నాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ లాంటి నగరాలకు వెళ్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలు పెడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యమేనా?

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు పోవడం లేదని తెలుస్తోంది. నిధులున్నా నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పీహెచ్ సీ నిర్మాణ పనుల్లో వేగం వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *