సిరా న్యూస్, ఆదిలాబాద్:
కంది శ్రీనివాస రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టే వరకు చెప్పులు ధరించను…
+ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో శపథం పూనిన పిడుగు స్వామి యాదవ్
+ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస రెడ్డి గెలుపు ఖాయమని వ్యాఖ్య
రాజకీయ నాయకులపై ఉన్న అభిమానాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తుంటారు. కొందరు పూజలు, పునస్కారాలు చేస్తే మరికొంత మంది పాదయాత్రలు, రోడ్ షోలు చేపడుతుంటారు. అయితే ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి పట్ల తనకున్న అభిమానాన్ని, ఆ పార్టీ జైనథ్ మండల ఓబీసీ మండల అధ్యక్షులు పిడుగు స్వామి యాదవ్ వినూత్నంగా చాటుకున్నారు. కంది శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెట్టేవరకు తాను కాళ్లకు చెప్పులు ధరించనని శపథం పూనాడు. శుక్రవారం మండల కేంద్రంలోని అతి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్‌లో అత్యంత కష్టకాలం ఉన్న కాంగ్రెస్ పార్టీని 77వేల ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా మార్చిన ఘనత కంది శ్రీనివాస రెడ్డిదేనని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుండి కంది శ్రీనివాస రెడ్డి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కంది శ్రీనివాస రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టేవరకు తాను ఈ కఠోరమైన దీక్షను పాటించడంతోపాటు ఆయన గెలుపే లక్ష్యంగా కృషీ చేస్తానని అన్నారు.