pillala marri tree : పిల్లలమర్రి వృక్షానికి తలమానికం

సిరా న్యూస్,మహబూబ్ నగర్;
ఆ మహా వృక్షానికి ఎంతోపేరు ఉంది. విశ్వంలోనే విశాల వృక్షంగా పేరు సంపాదించుకుంది. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ చెట్టు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద వృక్షంగా చెప్పుకుంటారు.పాలమూరు పర్యాటకానికే తలమానికంగా చెప్పుకునే ఆ వృక్షమే పిల్లల మర్రి. మహబూబ్ నగర్ జిల్లా లో దాదాపు మూడున్నర ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది ఈ పిల్లల మర్రి. అయితే నాలుగేళ్ల క్రితం పిల్లల మర్రికి చెందిన ఓ శాఖ చెట్టునుండి విడిపడి నేలకొరిగింది. అప్పటినుంచి పర్యాటకులు చాలా దూరం నుంచే ఈ చెట్టును చూసి వెళ్లవలసి వచ్చింది.నాలుగేళ్లకు ముందు దాకా వైభవోపేతంగా నిలచిన ఈ మహావృక్షానికి తెగులు సోకింది. పైగా చెట్టు కాండానికి చెదలు కూడా వచ్చి చేరాయి. దీనితో పిల్లల మర్రి శాఖల కొమ్మలు, ఆకులు బాగా దెబ్బతిన్నాయి. చూపులకు పచ్చని పందిరిగా కనిపించే ఈ చెట్టు అలా తయారవడంతో పర్యాటక ప్రేమికులు బాధపడ్డారు. ఇక ఈ చెట్టు ఇలాగే చరిత్రలో కలిసిపోవాల్సిందేనా అనుకున్నారు. మళ్లీ ఇప్పుడు సరికొత్త చిగుళ్లతో రెట్టింపు ఉత్సాహంతో చూపరులను తనవైపునకు తిప్పుకుంటోంది పిల్లల మర్రి. మళ్లీ పర్యాటకుల సందడి మొదలయింది.రోజురోజుకూ హరించుకుపోతున్న పిల్లలమర్రికి ఎలాగైనా పూర్వ వైభవం తేవాలని స్థానిక జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ పూనుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ చేసిన కృషి ఫలితంగా పిల్లల మర్రి మళ్లీ తన పూర్వ కళను సంతరించుకుంది. తక్షణమే అటవీ శాఖ అధికారులను పిలిపించుకుని వారి సలహాలు, సూచనలతో పిల్లల మర్రిని కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. క్లోరోపెరిపాస్ లిక్విడ్ ను సెలైన్ బాటిళ్లలో నింపారు. ఎక్కడెక్కడ ఊడలకు చెదలు పట్టిందో ఆ ప్రాంతంలో సెలైన్ ద్వారా ద్రావకాన్ని పంపించారు. అలాగే చెట్టు మొదళ్లలో కూడా సేంద్రీయ ఎరువులతో కలిపిన మట్టిని పోశారు. రసాయనాలు కలవని, సహజసిద్ధంగా తయారయిన ద్రావకాలను చెట్టు సంరక్షణకు ఉపయోగించారు. ఎట్టకేలకు వారి కృషి ఫలించింది. మళ్లీ పిల్లల మర్రి చిగుళ్లు తొడగటం ఆరంభించింది. కలెక్టర్ రొనాల్డ్ రాస్ ను ప్రత్యేకంగా అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి కలెక్టర్ జిల్లాకు ఒక్కరైనా ఉన్నా చాలు ప్రతి జిల్లా హరితవనంగా మారుతుందని అంటున్నారు వృక్ష ప్రేమికలు.నాలుగేళ్లుగా దూరం నుంచే చూసి సరిపెట్టుకుంటున్నపర్యాటకులకు జిల్లా అటవీ శాఖ అధికారులు ఓప్రకటన చేశారు. ఇకపై పర్యాటకులు పిల్లల మర్రిని దగ్గరగా సందర్శించవచ్చని. కాకపోతే చెట్టు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.ఎవరూ కూడా చెట్టును చేతితో తాకకూడదని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. చెట్టు నీడన అత్యంత సమీపంలో దూరం నుండి పిల్లల మర్రిని చూస్తూ ప్రస్తుతం పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *