సిరా న్యూస్,గుంటూరు;
వినుకొండలో రషీద్ హత్య రాజకీయ కోణంలో జరిగిందా? లేకుంటే వ్యక్తిగత కక్షలా? నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య రాజకీయరంగు పులుముకుంది. హతుడు వైసీపీ వ్యక్తి అని.. చంపింది టిడిపి కార్యకర్త అని.. దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నెలన్నర కాలంలో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
అయితే పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం కనిపించడం లేదని చెబుతున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేశారు.వాస్తవానికి హతుడు షేక్ రషీద్,నిందితుడు షేక్ జిలాని ఏడాది కిందటి వరకు వైసీపీలోనే తిరిగారు.వారి మధ్య వివాదాలతో విడిపోయినట్లు తెలుస్తోంది.2022 మొహర్రం రోజు మద్యం తాగిన క్రమంలో ఓ రెండు వర్గాలు సీసాలతో దాడి చేసుకున్నాయి.జిలాని బీరు సీసాతో ఒక వ్యక్తిని పొడవడంతో అతని తల,గొంతు పై గాయాలయ్యాయి.
దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలాని ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు.జిలాని సోదరుడు జానీ, కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్నబుల్లెట్ బండిని తగులు పెట్టాడు. దీనిపై జిలాని ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ అంతకంటే ముందు బీరు సీసా తో పొడిచాడని జిలానిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జైలుకు పంపించారు. దీంతో రషీద్ పై జిలాని కక్ష పెంచుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.ఈ కేసుల్లో జిలాని పేరును చేర్చారు.దీని వెనుక రషీద్ ఉన్నాడని జిలాని అనుమానించాడు.ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే
కొబ్బరి బొండాల కత్తితో దారుణంగా నరికి చంపాడు.ఇద్దరూ వైసీపీలోనే కొనసాగే వారని.. వైసీపీలో కొనసాగుతున్న రౌడీషీటర్ వద్ద అనుచరులుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. రషీద్ ది వైసీపీ అని..చంపిన జిలాని మాత్రం టిడిపి కార్యకర్త అని వైసిపి ఆరోపిస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసిపి అధినేత జగన్ వినుకొండ ఈరోజు వస్తున్నారు. ఇప్పటికే ఇది రాజకీయ కోణంతో జరిగింది కాదని పోలీసులు ప్రకటించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రాద్బలంతో జరిగిన హత్యగా చెబుతున్నారు.మరోవైపు రెండు పార్టీల మధ్య ఫోటోల వార్ నడుస్తోంది.
నారా లోకేష జన్మదిన వేడుకల్లో నిందితుడు జిలాని పాల్గొన్నారు అని.. టిడిపి కండువా వేసుకొని ప్రచార వాహనంపై జిలాని దిగిన ఫోటోలను వైసిపి ప్రచారం చేస్తోంది.అదే సమయంలో టిడిపి మరికొన్ని ఫోటోలను బయటికి తీసింది.వైసీపీ నేతలతో నిందితుడు జిలాని ఉన్న ఫోటోలను బయటపెట్టింది.దీంతో ఇది రాజకీయ అంశం గా మారిపోయింది.ఈరోజు జగన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.అయితే ఇప్పటికే పోలీసులు వినుకొండలో 144 సెక్షన్ ప్రకటించారు.ప్రస్తుతానికి అమలులో ఉంది.దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనతో రాజకీయంగా యాక్టివ్
కావాలని వైసిపి భావిస్తోంది.రాష్ట్రస్థాయిలో ఉద్యమించాలని నిర్ణయం తీసుకుంది.దీనిపై కార్యాచరణ ప్రారంభించింది.