Ponnam Prabhakar: చిగురుమామిడి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి:  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

సిరాన్యూస్‌, చిగురుమామిడి
చిగురుమామిడి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి:  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
* ఉద్వేగాల మధ్య ఆత్మీయ వీడ్కోలు
*  ముగిసిన మండల పరిషత్‌ సభ్యుల పదవీకాలం
* సమస్యలపై తనను నేరుగా సంప్రదించాలని సూచన
*  రాజకీయం అనుభవం లేకున్నా రాణించానన్న ఎంపీపీ కొత్త వినీత
* భర్త ప్రోత్సాహంతో మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లానని ఉద్వేగం

చిగురుమాడు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాన‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధ‌వారం క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండల పరిషత్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఉద్వేగంతో కొనసాగింది. పలువురు సభ్యులు తమ పనితీరును వివరిస్తూనే తమకు రాజకీయ అనుభవం లేకున్నా రాణించామని చెప్పుకొచ్చారు. కార్యక్రమానికి రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ చిహ్నం స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆత్మీయ సన్మాన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఐదేళ్లపాలన ఉగాది పచ్చడిలాగా కొంత తీయగా.. చేదుగా ఉండవచ్చని, మండలాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ ఓ కుటుంబంలా పనిచేశారని పేర్కొన్నారు. గెలిచినప్పటి నుంచి అందరికీ అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. మండలం అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిగురుమామిడి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. తను ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా పనిచేశానని, విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పోతుంటే అవకాశాలు కూడా అలాగే వస్తాయన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని వెల్లడించారు. పార్లమెంట్‌లో చర్చ యుద్ధంలా సాగుతాయని, సెంట్రల్ హాల్‌లో మాత్రం ప్రతిపక్షంతోపాటు విపక్షాలు కూడా కలిసి మాట్లాడుకుంటారని, అదే ప్రజాస్వామ్యం అని వెల్లడించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు వ్యవసాయంలో ఇబ్బందులు తెలుసని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తానని వివరించారు. ఇప్పటికే చిగురుమామిడి మండలంలో సర్వే జరుగుతోందని, రైతులు సహకరించాలని కోరారు.

ఉద్వేగానికి గురైన ఎంపీపీ..

ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. తన భర్త కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో ఎంపీపీగా మండల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. తనకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా వెన్నంటి ప్రోత్సహించారని, ఆయన సూచనలు, సలహాలతోనే ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లానని గుర్తు చేశారు. తన భర్త ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నా ఎలాంటి పదవులూ ఆశించలేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారని, తాను కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే వెచ్చించానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎంపీపీ కొత్త వినీతశ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ ఎంపీపీ భేతి రాజిరెడ్డి, ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవో మధుసూదన్, తహసీల్దార్‌ నరేందర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *