Pramod Chandra Reddy: చిన్నిగుండెకు “గ్లోబల్” అండ

సిరాన్యూస్‌, నిర్మ‌ల్‌
చిన్నిగుండెకు “గ్లోబల్” అండ
*  ఉచితంగా ఆపరేషన్ ….ఆర్థికంగా చేయూతనిచ్చి
*  వైష్ణవిని చదువుకునేలా చేసి
* వైద్యుడి డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి సహకారంతో విద్యార్థినికి నిండు జీవితం

నిర్మల్ జిల్లా కి చెందిన వైష్ణవి అందరూ మిత్రుల్లాగే తానూ పరీక్ష రాసింది. అంతకుముందు దేవుడు పెట్టిన పెద్ద పరీక్షనే ఎదుర్కొంది. ఈ జీవిత పరీక్ష పాస్ కావడానికి ఆమెకు “గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్” (శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, అభి, డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి ) అండగా నిలిచింది. చంద్రశేఖర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు చూపిన చొరవ ప్రమోద్ చంద్రారెడ్డి అనే వైద్యుడు ఇచ్చిన చేయూత ఆ విద్యార్థిని జీవితంలో వెలుగులు ప్రసాదించింది. మళ్లీ తన బాల్యంలో ప్రమోదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన స్వరూప, శ్రీకాంత్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తమ పదేళ్ల వైష్ణవిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో ఆమె అనుకోకుండా అనారోగ్యం పాలయ్యింది. కారణం ఏంటో తెలుసుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు తమ బిడ్డకు వచ్చిన కష్టం తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె చెరువైంది. చిన్నారి వైష్ణవి గుండెలో రంధ్రం ఉందన్న విషయం వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమెకు చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందనీ వైద్యులు చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ కూలీ బతుకుల వెల్లదీస్తున్న ఆ కుటుంబం ఇంత పెద్ద మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని దిగులు పెట్టుకుంది.
“గ్లోబల్” రాకతో..
తెలంగాణలోని పాఠశాలలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పించాలన్న లక్ష్యంతో “గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ష (జీటీఏ) గత విద్యా సంవత్సరంలో పలు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ సభ్యులు నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు సైతం వెళ్లారు. అక్కడి టాయిలెట్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించి వస్తుండగా.. అదే పాఠశాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు తమ విద్యార్థిని వైష్ణవి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ బృందం దృష్టికి తీసుకువచ్చారు.
వైద్యుడి చొరవతో..
వైష్ణవి ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకున్న జీటీఏ సభ్యుడు, నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు ప్రమోద్ చంద్రారెడ్డి, జీటీఏ చేయూతనిచ్చేందుకు వచ్చారు . ముందుగా జిల్లా కేంద్రంలోని ఆదిత్య మల్టీస్పెషలిటీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ ద్వారా ఆ పాపకు ప్రాథమిక పరీక్షలు చేయించారు. స్థానికంగా చికిత్స చేసే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ కార్డియాలజీ సర్జన్ డాక్టర్ రాజేష్ తో చర్చించారు. ఆ వైద్యుడి సూచన మేరకు వైష్ణవిని హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ కు పంపించారు. ఆరోగ్యశ్రీలో పెట్టినప్పటికీ తరవాత ఖర్చు లక్షల్లో ఉండడంతో మళ్లీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా చిన్నారి వైష్ణవికి ఆర్థికంగా చేయూత అందేలా ప్రమోద్ చంద్రారెడ్డి కృషి చేశారు. నెల రోజులు హాస్పిటల్ లో ఉండి, 8 రోజులు వెంటిలేటర్ పై ఉండి ప్రాణాల కోసం పోరాడిన చిన్నారి చివరికి జయించింది.
పరీక్ష రాసిన వైష్ణవి..
మళ్లీ తాను పాఠశాలకు వస్తానా అందరిలా చదువుకుంటానా అని బాధపడిన వైష్ణవికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అందించిన సహకారం గొప్పది. ఆమెకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించడంతో పూర్తిగా కోలుకొని ఇటీవల తన తోటి స్నేహితులతో కలిసి వార్షిక పరీక్షలను సైతం రాసింది.
ప్రమోద్ చంద్రారెడ్డికి సన్మానం..
తమ పాఠశాల విద్యార్థిని జీవితంలో వెలుగులు నిండడానికి సహకరించిన వైద్యుడు ప్రమోద్ చంద్రారెడ్డిని మంగళవారం దిలావర్పూర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, వైష్ణవి తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్, వీడీసీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వైష్ణవి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందించిందని, వ్యక్తిగతంగా తనకు ఆత్మసంతృప్తినిచ్చిందని వైద్యుడు ప్రమోద్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ అసోసియేషన్ ద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలలో టాయిలెట్లు, కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జంగం వీరేష్, వీడీసీ చైర్మన్ గంగారెడ్డి, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సదానందం, అరుంధతి, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, ప్రముఖ ఫిజిఒథెరపీ డాక్టర్ కిరణ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *