విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి

సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, ప్రజా సంఘాలు నిరసన
 సిరా న్యూస్,పిడుగురాళ్ల;
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, అక్రమంగా తొలగించిన 4వేల కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గురువారం పిడుగురాళ్ల పట్టణంలోనే బ్యాంక్ సెంటర్లో వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు విశాఖ ఉక్కు నిర్మాణం కోసం 28 వేల ఎకరాల భూములు రైతులు ఇచ్చారని ,వారికి ఈ రోజు వరకు కూడా పరిహారం కానీ, వారి పిల్లలకు ఉద్యోగాలు కానీ రాలేదని ఆయన విమర్శించారు .అంతేకాదు అనాటి విశాఖకు ఫ్యాక్టరీ తమిళనాడులో నిర్మించాలని నాడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో నిర్మించాలని కోరుతూ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని, ఆ సందర్భంగా 32 మంది ప్రాణ త్యాగం చేశారని ,అదేవిధంగా వారికి మద్దతుగా 68 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేశారని ,ఆ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని ,ఆ రోజు నుంచి ఈరోజు వరకు లాభాల్లో ప్రయాణిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆదోని ,అంబానీ వంటి కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం ప్రైవేటీకరణకు పూనుకుంటుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ, గత నాలుగు సంవత్సరాలుగా దీక్షలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా 4 వేల మంది కార్మికులను అక్రమంగా తొలగించిందని, 5 వందల మందికి వాలంటరీ రిటైర్మెంట్ చేయాలని, రెండువేల మందిని ఇతర చోట్ల ఉన్న ఫ్యాక్టరీలకి బదిలీ చేస్తుందని, ఇదంతా ప్రైవేటీకరణ లో భాగమని ఆయన ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఈ విధానాల ఆపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన మరియు ప్రతిపక్ష వైఎస్ పార్టీ లు నోరు మెదపక మోడీ విధానాలకు దాసోహం అవుతున్నాయని కనుక వెంటనే విశాఖ ఉక్కు మద్దతుగా ప్రకటన చేసి, ఉద్యమాల్లోకి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం నాయకులు నీలాద్రి రాంబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ భజన చేస్తుందని, దీనిలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అప్పనంగా మేస్తుందని ,కార్మిక చట్టాలను సవరించి, వారి హక్కులను హరిస్తుందని, రైతాంగ హక్కులను కాలరాస్తుందని, ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ ఆపకపోతే ఉద్యమాలు తప్పవని ఆయన మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు, ఏఐ టి యుసి నాయకులు జె.కృష్ణానాయక్ మాట్లాడుతూ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు ఆలంబిస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యమాలతోటే బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. సి టి యు నాయకులు ఓర్చు కృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై ఉక్కు పాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్నాయని, అణచివేతలతో ఉద్యమాలు ఆపలేరని ఆయన విమర్శించారు .ఈ కార్యక్రమంలో వామ పక్ష ప్రజాసంఘాల నాయకులు దీకొండ వెంకటేశ్వర్లు, జి నాగేశ్వరరావు, చావా కోటేశ్వరరావు, వెంకటప్పయ్య, కె. వెంకటేశ్వరమ్మ,సుజాత, వెంకటస్వామి ,సైదా ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *