జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయపు మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సిపిఓ, ఎస్సి సంక్షేమ, గురుకుల , బిసి, మైనార్టీ, జ్యోతి బా పూలే, విద్యా, పంచాయితి రాజ్, విద్యుత్,మిషన్ భగీరథ, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ శాఖల వసతి గృహల్లో సౌకర్యాలు కల్పనకు మండల ప్రత్యేక అధికారులు, ఆయా శాఖల సంక్షేమ అధికారులు, ఎంపీడిఓలు, తహసీల్దార్లు, ప్రిన్సిపాల్స్ ప్రతిపాదనలు అందచేయాలని ఆదేశించారు. గోడలు తడవడం విద్యుత్ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, విద్యుత్ అధికారులు తనిఖీ నిర్వహించి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సంక్షేమ అధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు సమస్యలు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. లో ఓల్టేజి విద్యుత్ సమస్య పరిష్కారానికి టు ఫేజ్ సరఫరా ఉన్న వసతి గృహాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలన్నారు.. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గురుకుల, సంక్షేమ పాఠశాలలకు మంచినీరు సరఫరా చేయాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా ఆర్. ఓ ప్లాంట్ లను ఏర్పాటు చేయాలని, సోలార్ వాటర్ హీటర్లు, సోలార్ సిస్టమ్, గురుకుల పాఠశాలలో ప్రహారీ గోడ, భవనలాలులో లికేజీలు, కిచెన్ షెడ్, ఫెన్సింగ్, గేట్లు, ఏర్పాటుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
సంక్షేమ హాస్టల్లో మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కిటికీలు, తలుపులు, మరుగుదొడ్లు మరమ్మత్తులకు, నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యజమానులదేనని యజమానుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్, ఎస్సి, బిసి సంక్షేమ అధికారులు సునీత, శైలజ, పంచాయతి రాజ్ ఈ ఈ దిలీప్, డీఈఓ రాజేందర్, ఎస్సి జిల్లా సమన్వయ అధికారి భిక్షపతి, విద్యుత్ డి ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.