రోడ్డుపై బైఠాయించిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్
సిరా న్యూస్,హైదరాబాద్;
నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండను ఖండించిన కేంద్ర మంత్రి
నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరిన సంజయ్
గంటకుపైగా నడిరోడ్డుపైనే కొనసాగుతున్న భైఠాయింపు.
ఒకవైపు నిరుద్యోగుల బాధలు వింటూ.. వినతులు స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి
మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగేంతవరకు కదిలేది లేదంటున్న సంజయ్
భారీ ఎత్తున తరలివస్తున్న నిరుద్యోగులు
భారీగా మోహరించిన పోలీసులు.
అటు పోలీసులు. ఇటు నిరుద్యోగుల మోహరింపుతో ఉద్రిక్తంగా మారిన అశోక్ నగర్ చౌరస్తా,
రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు అడ్డంకిగా ఉన్న 29 జీవోను ఎత్తేయాలని శాంతియుతంగా హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులపై గత మూడు రోజులుగా పోలీసులు వరుసగా ఝుళిపిస్తున్న లాఠీఛార్జ్ కు నిరసగా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులతో కలిసి ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రికి నిరసనగా వేలాది మంది నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్, 29 జీవోను రద్దు చేయాలి. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. రోడ్డపై బైఠాయించినంత సేపు వ్యూ వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తూనే ఉన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి రోడ్డు బైఠాయించిన విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడికి తరలివచ్చి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర మంత్రికి మద్దతుగా భారీగా తరలివస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అశోక్ నగర్ చుట్టుపక్కల వున్న హాస్టళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తూ. నిరుద్యోగులను బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు పెట్టి అనేక నిర్బంధాలకు గురిచేశారు. అయినప్పటికీ వాటన్నింటినీ తప్పించుకుని వేలాది మంది నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాకు తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి బైఠాయించారు. వ్యూ వాంట్ జస్టిస్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. బండి సంజయ్ జిందాబాద్ అంటూ నినదించారు. దీంతో అశోక్ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు పోలీసులు భారీగా తరలివచ్చి అక్కడ మోహరించారు. ఒకవైపు వేలాదిగా తరలివచ్చిన నినదిస్తున్న నిరుద్యోగులు, మరోవైపు పోలీసుల మోహరింపుతో అశోక్ నగర్ చౌరస్తా వద్ద పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బైఠాయింయిన కేంద్ర మంత్రిని కలిసేందుకు నిరుద్యోగులు క్యూ కట్టారు. పోలీసులు తమపై అన్యాయంగా లాఠీలు ఝుళిపించి గంటల తరబడి నిర్బంధించారని వాపోయారు. జీవోనెం.29 రద్దు చేసేవరకు తమకు అండగా నిలవాలని కోరారు. నిరుద్యోగుల విషయంలో నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు చేసిన అన్యాయాన్ని ఏకరవు పెడుతూ వినతి పత్రాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి వద్దకు వచ్చి అక్కడి నుండి వెళ్లిపోవాలని అభ్యర్థిస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ససేమిరా అంటున్న బండి సంజయ్ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ వేలాది మంది నిరుద్యోగులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనను కొనసాగిస్తుండటం విశేషం.