సిరాన్యూస్, బోథ్
అప్పులు చెల్లిస్తే తిరిగి రుణాలు: రీజనల్ మేనేజర్ పూర్ణచందర్
ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ నిధి కింద 112 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు అప్పుగా ఇవ్వడం జరిగిందని, అయితే 16 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయని, బకాయిలు చెల్లించినట్లయితే తిరిగి వారికి రుణ సౌకర్యం కల్పిస్తామని రీజనల్ మేనేజర్ పూర్ణచందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రీజనల్ మేనేజర్ పూర్ణచందర్ మాట్లాడారు. మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చెందింది మహిళలకు వ్యక్తిగతంగా వివిధ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు మూడు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాక తీసుకున్న రుణాలను 6 లేదా 12 నెలల వరకు తిరిగి చెల్లించినట్లయితే రెట్టింపు రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. డబ్బులు ఉండి కట్టని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పారు. ఒకటి రెండు చోట్ల డబ్బులు చెల్లించని మహిళా సమాఖ్య సభ్యులపై సీసీలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణం పొందిన ప్రతి మహిళ సభ్యురాలికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. సాధారణ మరణానికి రెండు లక్షల రూపాయలు వర్తిస్తుందన్నారు. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు 13 మంది సాధారణ మరణం చెందగా ముగ్గురు ప్రమాదంలో పడి మృతి చెందడం జరిగిందన్నారు. అయితే వారిని సిసి ల ద్వారా గుర్తించి అందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ చేయడం జరిగిందన్నారు. త్వరలోనే వారి కుటుంబాల వారికి ఇన్సూరెన్స్ డబ్బులు అందివ్వడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీలు వారి పరిధిలో ఉన్న మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ప్రభుత్వపరంగా అందుతున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. లేకుంటే మహిళలు నష్టపోతారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సీసీలకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశంలో ఏపిఎం మాధవ్ పాల్గొన్నారు.