సిరా న్యూస్, ఆదిలాబాద్:
సకల రోగాలు హరించే పూసాయి ఎల్లమ్మ… జాతర విశేషాలు ఇవే..
+ జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న జాతర
+ అన్ని ఏర్పాటు పూర్తి చేసిన గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పూసాయి గ్రామంలో వెలిసిన రేణుక ఎల్లమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. ఈ నెల 11న పుష్యమాస అమవాస్య నుండి ఫిబ్రవరి 12 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక జాత నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సర్వం సిద్ధం చేసారు. ప్రతీ ఏట జాతర సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. పెర్గుతున్న భక్తుల తాకిడికి అనుగూణంగా ఆలయం వద్ద భక్తుల కోసం అవసరమైన అన్ని ఏర్పాటు పూర్తిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతీ సంవత్సరం జాతరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచే కాక మహారాష్ట్రలోని పాండర్‌కౌడ, యవత్‌మాల్, బోరి నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జర్గుతుంది.
పుష్యమాసం ప్రత్యేకం..
ప్రతి సంవత్సరం పుష్య మాసంలో నెల రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహించడం జర్గుతుంది.. ఈ ఏడాది జనవరి 11నుంచి జాతర ప్రారంభం కానుండటంతో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు గ్రామస్తులంత సిద్దమౌతున్నారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగినప్పటికి కూడ కేవలం నెలలోని ఆది, మంగళ వారాల్లో మాత్రమే అధిక సంఖ్యలో ఇక్కడి భక్తులు వస్తుంటారు. పుష్యమాస అమవాస్య రోజు గ్రామస్తులంత భాజాబజంత్రీల, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించడంతో జాతర ప్రారంభమౌతుంది. అయితే ఎల్లమ్మ గర్భ గుడి నుంచి వచ్చే జలదార కోనేరులో స్నానాలు చేస్తే వివిద చర్మ రోగాలతో పాటు, వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. జాతర రోజుల్లో అమ్మవారికి పూజలు చేసిన వారి కోరిన కోరికలు తీరుతాయని, ఇష్టసిద్ది ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాగా ప్రతీ ఏట జాతరలో భక్తుల తాకిడి పెర్గుతుండటంతో గ్రామస్తులు జాతరను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మందు, మాంసమే నైవేధ్యం…
ఈ రేణుక ఎల్లమ్మ తల్లికి మందు, మాంసం నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులంత కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, అక్కడే పిండి వంటలు వండు కోవడం జర్గుతుంది. అమ్మవారికి కోళ్లు, మేకలను బలి ఇచ్చిన తరువాత వాటి అక్కడే వండుకొని అమ్మవారికి నైవేద్యంగా మాంసంతో పాటు మందును సమర్పించడం జర్గుతుంది. ఈ ఆలయంలో ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో ప్రతీ ఏట భక్తుల తాకిడి భారీగా పెరుతోంది. దీంతో గ్రామస్తులు జాతరకు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. భక్తులంత పెద్ద సంఖ్యలో విచ్చేసి, అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.