మేడారానికి రైల్వే లైన్

సిరా న్యూస్,వరంగల్;
తెలంగాణలో రైల్వే ప్రగతి పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రం అవసరాలకు తగినట్లుగా కేంద్రం రైళ్లను కేటాయించింది. కొత్త రైల్వే లైన్లు మంజూరు చేస్తోంది. అమృత్‌ పథకంలో అనేక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది.
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే మణుగూరు–రామగుండం రైల్వే లైన్‌ నిర్మాణాన్ని స్పీడప్‌ చేసింది. భూసేకరణ యుద్ధప్రాతిపదికన కొనసాగించేందుకు ముఖ్య అథికారులను నియమిస్తోంది. ఈమేరకు అక్టోబర్‌ 16న ప్రత్యేక నోటీసులు ఇచ్చింది. దీంతో అధికారులు రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై అధికారులు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి ఆర్డీవో, కాటారం సబ్‌ కలెక్టర్, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ ఈ భూసేకరణ బాధ్యతలు చేపట్టారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుపై కసరత్తు చేస్తున్నారు. మల్హర్‌రావు, కాటారం మండలాలు కాటారం సబ్‌ కలెక్టర్‌ చూస్తుండగా, ఘన్‌పూర్, భూపాలపల్లి మండలాలను భూపాలపల్లి ఆర్డీవో చూస్తున్నారు. ఇక మేడారం మీదుగా రైల్వేలైన్‌ పనులు ముత్తారం, మంథని, రామగిరి, కమాన్‌పూర్‌ పెద్దపల్లి ప్రాంతాల పనులను పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు. మణుగూరు నుంచి భూపాలపల్లి, కాటారం, మల్హర్‌రావుపేట, ఘన్‌పూర్, భూపాలపల్లి మండలాల మీదుగా రామగుండం వరకు 207.80 కిలోమీటర్ల మేర బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ పనులు చేపట్టనున్నారు.రామగుండం–మణుగూరు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయితే బొగ్గు రవాణాకు కీలకంగా మారుతుంది. ఈ ట్రాక్‌ ఆలోచన 1999లో రాగా, 2013–14లో దీనిపై దృష్టిసారించారు. మొదట రూ.1,100 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని భావించారు. ఇప్పుడు 3,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈ ట్రాక్‌ నిర్మాణంతో భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా బొగ్గు రవాణా సులువు అవుతుంది.ట్రాక్‌ నిర్మాణంతో అడవి తల్లులుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయానికి చేరుకోవడం సులభం అవుతుంది. పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది. మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ కొత్త రైల్వేలైన్‌ తాడ్వాయి గుండా వెళ్తుంది. దీంతో అమ్మల దర్శనం మరింత చేరువ అవుతుంది. ఈ రైలు మార్గం ములుగు, భూపాలపల్లి ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *