సిరా న్యూస్, హైదరబాద్:
రైతుబంధు డబ్బులు వాపస్ ఇవ్వాల్సిందే… సర్కార్ కొత్త స్కెచ్
గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయేతర భూములు, వెంచర్లకు చెల్లించిన రైతు బంధు డబ్బులను సంబంధిత వ్యక్తుల నుండి రికవరీ చేసేందుకు రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అనర్హులైన వ్యక్తులకు చెల్లించిన రైతుబంధు డబ్బులు వాపస్ రప్పించి, అర్హులైన వారికి మాత్రమే డబ్బులు అందించాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. అక్రమంగా రైతు బంధు డబ్బులు పొందిన వ్యక్తులకు నోటీసులు అందించి, రికవరీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభ్తుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభ్తుత్వ హయాంలో 25వేల కోట్ల రైతు బంధు నిధులు అనర్హులకు అందినట్లు ఇప్పటికే ప్రభుత్వం లెక్కలు తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతుబంధు పొందిన వ్యక్తుల పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. దీంతో పాటు రైతు బంధుపై ప్రభుత్వం రైతుల వద్ద నుండి అభిప్రాయ సేకరణ సైతం చేస్తున్న విషయం తెలిసింది. ప్రభుత్వం నిర్వహించిన ఈ అభిప్రాయ సేకరణలో మెజార్టీ రైతులు కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తుందో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే 5 నుండి 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు బంధు వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.