Rajarshi Shah:ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం చేయాలి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం చేయాలి
యువతకు అవగాహన కల్పించాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా

ఎన్నికలలో యువత వంద శాతం ఓటు నమోదు చేసుకొని , ఓటు హక్కు ను వినియోగించుకునేలా కమిటీ సభ్యులు స్వీప్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీప్ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో స్వీప్ కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఓటు హక్కు పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓటు ప్రాముఖ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం తేవాలని అన్నారు. యువత వంద శాతం ఓటు నమోదు చేసేలా స్వీప్ ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేయాలనీ, పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీలకు క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని అన్నారు. డబ్బు, మద్యం, బహుమతుల ఎన్నికల వేళ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా అభ్యర్థులను ఎన్నుకున్నట్లైతే తిరిగి వారి నుండి మనం మంచిని ఆశించవచ్చన్న విషయాన్ని యువ ఓటర్లకు తెలియజేయడం కనీస భాద్యత అని అన్నారు. మేరా పహ్ల వోట్ దేశ్ కీలియే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందేలా చూడాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందేలా, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చైతన్యం కల్పించాలని అన్నారు. ప్రతి నియోజక పరిధిలో స్వీప్ ప్రోగ్రాం కోసం బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో , పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి కూడలి వద్ద ఓటు హక్కు గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఓటు హక్కు దేశంలోని ప్రతి ఒక్కరికి సమానమని అందరికి సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగంలో పొందు పరిచారని అన్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, స్వీప్ కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *