సిరాన్యూస్, ఆదిలాబాద్
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రిజిస్టర్ తో పాటు ఆన్లైన్ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.ఇప్పటివరకు అదిలాబాద్ మార్కెట్ యార్డ్ నందు 3415 మంది రైతుల నుండి 82,000 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసినట్లు సెంట్రల్ ఇంచార్జ్ కె పండరి తెలిపారు. ఇంకను 15 వేల క్వింటాళ్ళ జోన్న లు రావచ్చని అంచనా వేశామని అన్నారు.అనంతరం ఇచ్చోడ మార్కెట్ యార్డ్ ను తనిఖీ చేసి అక్కడ వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు 2119 మంది రైతులనుండి 40,500 క్వింటాళ్ళ జొన్నలు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఇంచార్జ్ ఆర్ ఈశ్వర్ కలెక్టర్ కు వివరించారు. వర్ష సూచనలు ఉన్నందున అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా ఈనెల 31వ తేదీ వరకు అన్ని కొనుగోలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను రిజిస్టర్ లతో పాటు ఆన్ లైన్ విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని ఆరా తీశారు. రైతులు జొన్నలు తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీలలో లోడ్ చేయించి, రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్ లు అందించాలన్నారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు సేవలందించేలా ఏర్పాట్లు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్ లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. జొన్నలు తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని ఆన్నారు.కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల కూరుస్తున్నందున రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా జొన్నాలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని ,వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ముందస్తుగానే వారిని అప్రమత్తం చేయాలని, తద్వారా ఆరబోసిన ధాన్యం తడవకుండా వారు జాగ్రత్తలు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులకు సూచించారు. జొన్నలు సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సహకార అధికారి బి మోహన్ , మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.