ఇంకా దొరకని రమణయ్య హంతకుడు

సిరా న్యూస్,విశాఖపట్నం;
తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు…పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నగరం విడిచి పరారు కాగలిగాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు తొలుత అనకాపల్లి వైపు వెళ్లి ఒకచోట తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి శనివారం ఉదయాన్నే ఎయిర్పోర్టుకు చేరుకుని చెన్నై వెళ్లిపోయినట్టు భావించిన పోలీసులు అక్కడకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన సీపీ రవిశంకర్అయ్యన్నార్ కూడా నిందితుడు ఎవరనే దానితోపాటు అతనికి సంబంధించిన పూర్తివివరాలు, ఎక్కడికి వెళ్లిపోయాడు, ఎక్కడి నుంచి టికెట్లు బుక్ చేసుకున్నాడనే వివరాలు సంపాదించామని ప్రకటించారు. త్వరలో అతడిని అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. అయితే నిందితుడు శనివారం సాయంత్రం వరకూ నగరంలోనే ఉన్నాడని, 4.30 గంటలకు బెంగళూరు మీదుగా చెన్నై వెళ్లే విమానం ఎక్కినట్టు తెలియడంతో పోలీసులు కంగుతిన్నారు. నిందితుడు బెంగళూరులో విమానం దిగిపోయాడు. చెన్నై వెళ్లలేదు.
అయితే నిందితుడు బెంగళూరులో ఉండిపోయిన విషయం తెలియని పోలీస్ అధికారులు అప్పటికే చెన్నై వెళ్లిన బృందాన్ని అక్కడి ఎయిర్పోర్టుకు పంపించి విశాఖ నుంచి వచ్చిన విమానంలో నిందితుడి కోసం వెతికించారు. నిందితుడు కనిపించకపోవడంతో అతని సెల్ఫోన్ టవర్ లొకేషన్ పరిశీలించగా బెంగళూరులోనే ఉండిపోయినట్టు తేలింది. నిందితుడు అప్పటికే నాలుగు సిమ్ కార్డులు మార్చి మార్చి వాడుతున్నట్టు, అతని భార్య కూడా శనివారం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినట్టు కాల్డేటాలో పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఏదిఏమైనా పోలీసులు నిందితుడి ఆచూకీని పక్కాగా కనిపెట్టగలిగి ఉంటే నగరంలోనే అతడిని అరెస్టు చేసి ఉండగలిగేవారు. కానీ సరిగా అంచనా వేయలేకపోయారు. నిందితుడు ఉదయాన్నే నగరం విడిచి విమానంలో వేరే రాష్ట్రం వెళ్లిపోయినట్టు భావించారు. దీనివల్ల నిందితుడు నగరంలో జరుగుతున్న తతంగాన్ని మీడియాలో చూసి…సాయంత్రం బెంగళూరు వెళ్లాడు. నిందితుడు ఎవరనేది తెలిసినందున శనివారం ఉదయం నుంచి సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు చేయడం, ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్, బస్కాంప్లెక్స్లో నిఘా పెట్టినట్టయితే తప్పించుకునేందుకు అవకాశం ఉండేది కాదని కొంతమంది పోలీసులే అభిప్రాయపడుతున్నారు.
ఘటన రాత్రి 10 గంటలకు జరగ్గా 11.30 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆరు గంటల సమయం అంటే ఉదయం ఆరు గంటలకు నిందితుడి వివరాలు సేకరించారు. విమానంలో పారిపోవడానికి టికెట్ కొన్నాడని గుర్తించారు. మరి నిందితుడి వివరాలు విమానాశ్రయానికి పంపించి, అక్కడ ఎందుకు పట్టుకోలేకపోయారు?…అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రస్తుతం విమానాశ్రయంలో రన్వేకు మరమ్మతులు జరుగుతున్నాయి. విమానాలు 8 గంటలకు బయలుదేరుతున్నాయి. శనివారం హైదరాబాద్ కు తొలి విమానం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. పోలీసులకు ఆ సమాచారం ముందుగానే తెలిసి ఉంటే విమానం ఎక్కక ముందే నిందితుడిని పట్టుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *