చేవేళ్ల పోటీకి రంజిత్ రెడ్డి దూరం

 సిరా న్యూస్,రంగారెడ్డి
బీఆర్ఎస్ కు రోజుకో ఇబ్బంది వ‌చ్చిప‌డుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆ పార్టీ అధినాయ‌క‌త్వాన్నే కాదు నేత‌ల‌ను కూడా వ‌ణికిస్తోంది. బీఆర్ఎస్ నుండి పోటీ అంటే నేత‌లంతా గ‌తంలో సంతోష‌ప‌డేవారు. టికెట్ కోసం పైర‌వీలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు పిలిచి టికెట్ ఇస్తామ‌న్నా ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కేటీఆర్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు రివ్యూలు చేశారు. అందులో ఫ‌స్ట్ రివ్యూ చేసిన స్థానం చేవేళ్ల. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మ‌ళ్లీ పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు కూడా. ఆయ‌న కూడా గ్రౌండ్ రెడీ చేసుకున్నారు. కానీ చేవేళ్ల‌లో ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. బ‌ల‌మైన నేత‌గా ఉన్న ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి దంప‌తులు కాంగ్రెస్ కు జైకొట్టారు. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి, ఆయ‌న కోడ‌లు జెడ్పీ చైర్మ‌న్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న గ్రూప్ గొడ‌వ‌ల‌కు తోడు, బీజేపీ నుండి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. చేవేళ్ల ఇంచార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఉండ‌టంతో ఆ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీంతో, పోటీపై ఎంపీ రంజిత్ రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. త్రిముఖ పోటీ జ‌రిగితే బీఆర్ఎస్ కు ఇబ్బంది అన్న ఉద్దేశంతో రంజిత్ రెడ్డి పోటీ నుంచి త‌ప్పుకుంటున్నారు. అధిష్టానానికి ఇప్పటికే స‌మాచారం ఇచ్చార‌ని సమాచారం. దీంతో పార్టీ మాజీమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అవ‌కాశం ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. స‌బితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ క‌న్నా పెద్ద లీడ‌ర్ ఎవ‌రూ ఇప్ప‌టికిప్పుడు ఎంపీగా నిల్చుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో… పార్టీ కూడా కార్తీక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానం ప‌ని చేసుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల క‌థ‌నం. మొన్న‌టి వ‌ర‌కు సికింద్రాబాద్ సీటు కోసం ప్ర‌య‌త్నించిన కార్తీక్ రెడ్డి చేవేళ్ల బ‌రిలో ఉంటారో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *