సిరా న్యూస్;
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగాయి. అసలు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో అంశమైంది. చివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని ఖజానాను తెరవాలని నిర్ణయించారు.దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ భాండాగారాన్ని తెరవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈనెల 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీలోని 16 మంది సభ్యులు తీర్మానం చేశారు. భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రతపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ.భాండాగారం తాళం విషయంలో ఉన్న వివాదంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జస్టిస్ బిశ్వనాత్ రథ్ కమిటీ. భాండాగారం డూప్లికేట్ తాళపుచెవి కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉందని.. దాంతో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలుపులు తెరుస్తామంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఈ లెక్కింపు ఎప్పటిలోపు పూర్తి అవుతుందో అప్పుడే చెప్పలేం అంటోంది జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ. నగల లెక్కింపు కంప్లీట్ అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ, నియమ నిష్టలతో ఉంటారు.జగన్నాథుడి వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు. ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యతను పరిశీలించనున్నారు. గట్టి భద్రత మధ్య లెక్కింపు జరగనుంది. మరోవైపు రత్న భాండాగారం రిపేర్ల కోసం మరో కమిటీ అవసరమని జస్టిస్ రథ్ కమిటీ అభిప్రాయపడింది.పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా, 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్ని నగలను వదిలేయడంతో సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతుండటంతో రిపేర్లు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. కానీ ముందడుగు పడలేదు. దీన్ని మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. కమిటీ ఇప్పుడు రత్న భాండాగారాన్ని తెరవనుంది.