అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు..
50 మంది అరెస్ట్
బెంగళూరు;
కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్లో రేవ్పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారకస్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
రేవ్పార్టీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి శాంపిళ్లు సేకరించామని, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.