బ్యాంకులపై ఆర్బీఐ కొరడా..

సిరా న్యూస్,ముంబై;
దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడడంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దేశంలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడం, ద్రవోల్బణం లేకుండా చూడడం, వివిధ బ్యాంకులకు సహాయ సహకారాలు అందజేయడం దీని ప్రధాన విధులు. తద్వారా దేశంలో ఆర్థిక స్థిరత్వం కలగడం, అభ్యున్నతి దిశగా పయనించడానికి అవకాశం కలుగుతుంది.రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దేశంలోని వివిధ బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. ఒకవేళ ఆ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. అలాగే షింషా సహకార బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేసింది. ఆయా బ్యాంకులు నిబంధనలను సక్రమంగా పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది.పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రుణాలు, అడ్వాన్స్ లు, కేవైసీకి సంబంధించి కొన్ని నిర్ధిష్ట ఆదేశాలను పాటించలేదు. ఆ బ్యాంక్ ను 2022 మార్చి 31న తనిఖీ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని గమనించింది. వాటిపై సమాధానం చెప్పాలని బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. దానికి పీఎన్బీ నుంచి వచ్చిన ప్రత్యుత్తరాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జరిమానా విధించింది.సబ్సిడీలు / వాపసులు / రీయింబర్స్‌మెంట్ల ద్వారా ప్రభుత్వం నుంచి స్వీకరించదగిన మొత్తాలకు వ్యతిరేకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్‌లకు వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ రుణాలను పీఎన్బీ మంజూరు చేసినట్లు ఆర్బీఐ గుర్తించింది. అలాగే కొన్ని ఖాతాలలో వ్యాపార సంబంధాల సమయంలో కస్టమర్ల గుర్తింపు, వారి చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో విఫలమైంది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై రూ. 1.31 కోట్ల ద్రవ్య పెనాల్టీ విధించింది.కర్ణాటకలోని షింషా సహకార బ్యాంక్ పైనా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో దాని లైసెన్స్‌ను రద్దు చేసింది. దీంతో జూలై 5వ తేదీ సాయంత్రం నుంచి బ్యాంకింగ్ వ్యాపారం నిలిచిపోయింది. బ్యాంకును మూసివేయడానికి, అలాగే బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించడానికి ఆర్డర్ జారీ చేయాలని కర్ణాటక సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను కూడా కోరింది. లిక్విడేషన్ ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి రూ. 5 లక్షల వరకు ఖాతాదారులు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్వీకరించడానికి అర్హులు. షింపా బ్యాంకులో 99.96 శాతం డిపాజిటర్లు డీఐసీజీసీ నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్‌బీఐ తెలిపింది.షింపా బ్యాంకుకు తగిన మూలధనం, సంపాదన అవకాశాలు లేవని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల దాని కొనసాగింపు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వివరించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి బీమా చేసిన డిపాజిట్లలో రూ.11.85 కోట్లను ఇప్పటికే డీఐసీజీసీ చెల్లించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *