సిరా న్యూస్,హైదరాబాద్;
ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2,500 చొప్పున త్వరలో జమ చేస్తామని ప్రకటించారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు.విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో నిర్వహించబోయే కేబినెట్ భేటీలో కొన్ని పథకాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆరు గ్యారంటీల్లో మిగిలిన హామీలను కూడా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే అంశంపై కసరత్తు చేస్తున్నారు.ఇక మహిళలకు రూ.2,500 అందించే పథకానికి కూడా తెల్ల రేషన్‌కార్డును తప్పనిసరి. ఇప్పటికే గ్యాస్, గృహజ్యోతి పథకాలను తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో త్వరలో అమలు చేసే ఆర్థికసాయం పథకం కూడా తెల్ల రేషన్‌కార్డు ఉన్న మహిళలకే ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మరోవైపు అర్హుల ఎంపిక విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం, ఫింఛన్లు పొందని వారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలై నుంచి దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
======