20 లక్షల కోట్లు దాటిన రిలయన్స్

సిరా న్యూస్,ముంబై;
దేశీ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ కంపెనీ షేర్లు 14 శాతం మేర పుంజుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ బీఎస్‌ఈలో రూ. 2,957 వద్ద సరికొత్త రికార్డును తాకింది. దీంతో ఫిబ్రవరి 13న ఇంట్రాడేలో రిలయన్స్‌ మార్కెట్‌ విలువ 1.8 శాతం పెరిగింది.2005 ఆగస్టులో రిలయన్స్‌ మార్కెట్ విలువ రూ. 1 లక్ష కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 2007లో రూ. 2 లక్షల కోట్లకు, సెప్టెంబర్ 2007లో రూ. 3 లక్షల కోట్లకు, అక్టోబర్ 2007లో రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. జూలై 2017లో రూ. 5 లక్షల కోట్లకు చేరుకోవడానికి రిలయన్స్‌ కంపెనీకి 12 ఏళ్లు పట్టింది. నవంబర్ 2019లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లకు, సెప్టెంబర్ 2021లో రూ. 15 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక జనవరి 2024లో రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ స్టాక్ విలువ 10.4 శాతం నుంచి పైపైకి పెరగడం ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 29 నాటికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఫిబ్రవరిలో దాదాపు 4 శాతం పెరిగింది. కేవలం 600 రోజుల్లో రూ.5 లక్షల కోట్లు విలువ కూడదీసుకుంది. ఈ క్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం రూ.2,904 వద్ద ముగిసింది.ట్రేడింగ్‌లో 11.16 గంటలకు 1.8 శాతం మేర లాభంతో రూ.2,953 వద్ద ట్రేడయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 1.26 శాతం లాభంతో రూ.2941 వద్ద ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నం 2.19 గంటలకు ఈ షేరు గత ముగింపుతో పోలిస్తే 0.76 శాతం మేర పెరిగి రూ.2,925 వద్ద ట్రేడయ్యింది. దీంతో ఈ రోజు రిలయన్స్‌కు బాగా కలిసొచ్చినట్లైంది. ఇక మార్కెట్‌ విలువ పరంగా చూస్తే రూ.15 లక్షల కోట్లతో టీసీఎస్‌ రెండో స్థానంలో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ రూ.10.5 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.7 లక్షల కోట్లు, ఇన్ఫీ రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో అత్యధిక విలువ కంపెనీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *