యాదాద్రీశుడికి రేవంత్ పట్టుబట్టలు

సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‎లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవో, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం నుండి సీఎం రేవంత్ దంపతులు, మంత్రులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్, మందుల సామేలు, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డిలు సీఎం రేవంత్ కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న స్వామికి తీరు కళ్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు.
సీఎం హోదాలో రేవంత్..
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్య, చెన్నారెడ్డి, కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలకు ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు. యాదగిరిగుట్ట నుంచి నేరుగా హెలికాప్టర్‎లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భద్రాచలంకు వెళ్లారు.
=============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *