పెట్టుబడులకు రావాలని పిలుపు
సిరా న్యూస్,హైదరాబాద్;
అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా ఉందని అభివర్ణించారు. అమెరికాకు ఆయువుపట్టుగా ఉన్న తెలుగు వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకోవాలని సూచించారు. న్యూజెర్సీలో ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో తెలంగాణ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వారితో రేవంత్ రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వేల మంది తరలివచ్చారు. భారీ ర్యాలీగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. భారీ స్వాగతాల మధ్య సమావేశ మందిరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి… అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడారు.
సమావేశంలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..”తెలంగాణ మీ జన్మభూమి, ఇక్కడ పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగం పంచుకుంటే ఆనందం బోనస్‌గా వస్తుంది. గతేడాది టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికా వచ్చాను. పదేళ్లు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని అప్పుడు చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను” అని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు రేవంత్ రెడ్డి…” ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాం. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాం. ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా ఇస్తున్నాం. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందజేస్తున్నాం. ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చామని రేవంత్ వివరించారు. కాంగ్రెస్ పాలనపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే పాలసీలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడంతోపాటు రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక విధానం రూపొందించామన్నారు సీఎం. అసూయతో అబద్దాలు ప్రచారం చేసే వారి మాటలు పట్టించుకోవద్దని ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ” ఎన్నికల టైంలో మాపై ఎంతో విష ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారు. వచ్చినా ఎన్నో రోజులు ఉండదని కూడా జోస్యాలు చెప్పారు. అలాంటివి జరగలేదు. అందుకే ఇప్పుడు కొత్త ప్రచారానికి తెరతీశారు. రాష్ట్రంలో అభివృద్ధి స్లోడౌన్ అయిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు ప్రజలు ఎప్పుడో బుద్ది చెప్పారు. అయినా వాళ్లు అబద్దాల ప్రచారాన్ని మానుకోలేదు. వాళ్లకు మరోసారి బుద్ధి చెబుతాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే టాప్ సిటీగా డెవలప్‌చేస్తాం. అని సీఎం ప్రకటించారు. అమెరికా అభివృద్ధిలో ప్రవాసుల కృషిని రేవంత్ రెడ్డి కొనియాడారు. వారిని అభినందించారు. ఇప్పుడు సొంతగడ్డపై ప్రేమను కురిపించాలని రిక్వస్ట్ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్‌తోపాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దీని కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో మరో సిటీని ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్‌తో దాన్ని అత్యున్నతమైన సిటీగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ప్రవాసులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ప్రవాసులు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేస్తున్న తీరుపను కొనియాడారు. తెలంగాణలో పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తామని ప్రభుత్వంతో కలిసి ప్రచారంలో పాల్గొంటామని ప్రవాసులు మాట ఇచ్చారు
7 నుంచి వరుస భేటీలు
వాషింగ్టన్‌లో ఐటీ సేవల సంస్థలు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు. 8న కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్ యూనికారన్స్ ప్రతినిధులతో మాట్లాడతారు. సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలోనూ సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో సిఎం రేవంత్ భేటీ ఉండనుంది. స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్‌ను సీఎం రేవంత్ సందర్శిస్తారు. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈఓ, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను సీఎం రేవంత్ కలుస్తారు. ఈ నెల 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా సియోల్‌కు చేరుకుంటారు. 12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్తోతో సీఎం భేటీ ఉంటుంది. 14న రేవంత్ బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతుంది. దక్షిణ కొరియా పర్యటనలో సామ్‌సంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరపనుంది.అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో రేవంత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీలకతీతంగా తెలంగాణ అభివృద్ధి ముఖ్యమన్నారు కేటీఆర్.