జీవో 59 ద్వారా అక్రమ క్రమబద్ధీకరణ కు పాల్పడిన ఫైళ్ల రీవెరిఫికేషన్‌ చేయాలి

అక్రమాల నిగ్గు తేల్చాలి.

జిల్లా మంత్రి తుమ్మల ను కలిసిన సిపిఎం బృందం

సిరా న్యూస్,ఖమ్మం;

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేరుతో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ఈ సమస్య పైన పార్టీ ప్రతినిధి బృందం చర్చించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్‌ 59 ని పక్కదారి పట్టించే విధంగా అక్రమ పద్ధతిలో అనేకమంది క్రమబద్ధీకరణ చేస్తున్నారని వారన్నారు. తక్షణమే క్రమబద్ధీకరణ లిస్టును సమగ్ర రీ వెరిఫికేషన్‌ చేసి తప్పులకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని అక్రమ క్రమబద్దీకరణకు పాల్పడిన వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందర్భంలో ఈ తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందని, ఎన్నికల తర్వాత ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకొని ఈ సమస్యను పక్కకు నెట్టేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారని వారన్నారు. తక్షణమే ప్రతి దరఖాస్తు రీ వెరిఫై చేయాలన్నారు.ఎలాంటి నిర్మాణాలు లేని ప్రభుత్వ భూముల్లోనూ ఎప్పటినుంచో నిర్మాణాలున్నట్లు చూపించి, విలువైన భూములను కొందరు వ్యక్తులకు ధారాదత్తం చేశారన్నారు. గతంలో నగరంలో పేదలు గుడిసెలు వేసుకుంటే ఆ స్థానాలను ఖాళీ చేయించారని, తిరిగి అదే స్థానాలలో కొందరు పెద్దలకు ఈ జీవో అడ్డుపెట్టి ఆ స్థలాలను అప్పజెప్పారని వారు విమర్శించారు. ఇల్లు లేకపోయినా ఉన్నట్టు చూపిన వాటిని సాటిలైట్‌ మ్యాప్‌ ద్వారా పరిశీలించాలని వారన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. నగర సమీపాన ఉన్న శివాయిగూడెం పువ్వాడ ఉదయ్‌కుమార్‌ నగర్‌లో అనేకమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వారిని బెదిరించి వారి దగ్గరున్న పట్టాలు తీసుకొని వాటిని కూడా కొందరు వ్యక్తులు అమ్ముకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడ నివాసం ఉంటున్న పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైవిక్రమ్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, ఎస్‌. నవీన్‌ రెడ్డి దొంగల తిరుపతిరావు, 3 టౌన్‌ పార్టీ కార్యదర్శి భూక్య శ్రీనివాస్‌, 2 టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *