ప్రాణాలు తీస్తున్న కుప్పలు
సిరా న్యూస్,మెదక్;
వాహనాలు తిరిగే రోడ్లపై వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద ట్రాక్టర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడానికి రోడ్డు పై వడ్ల కుప్పలే కారణమయ్యాయి. ఈ ఒక్క సంఘటనే కాదు ప్రతి ఏటా వానకాలం, యాసంగి పంట కోత సీజన్ లో ఇదే సమస్య ఎదురవుతోంది. గడిచిన మూడేళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్లపై వడ్ల కుప్పల కారణంగా ప్రమాదాలు జరిగి పది మందికి పైగా చనిపోయారు.పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన రహదారులతో పాటు పలు ఇతర రహదారుల పై కూడా పెద్ద ఎత్తున్న వడ్లను అరబోస్తున్నారు రైతులు. దీంతో చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేకపోవడం వల్ల రైతులు రోడ్లపై వడ్లు ఆరబోస్తున్నమని అంటున్నారు. రోడ్లపై పెద్ద ఎత్తున్న వడ్ల కుప్పలు ఉండడం వల్ల వీటిని గమనించక వేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. వడ్లను అరబెట్టడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులతో పాటు, నేషనల్ హైవేలపై సైతం రైతులు వడ్లు ఆరబోస్తున్నారు. నర్సాపూర్ ఉంచి తూప్రాన్ వెళ్లే దారిలో.. మెదక్ పాపన్నపేట, పెద్దశంకరంపేట రూట్‌లో, కొల్చారం వెల్దుర్తి, రంగంపేట- జోగిపేట, చేగుంట బోనాల రూట్లతో పాటు 44 నెంబర్ నేషనల్ హైవే పై, మెదక్ – హైదరాబాద్ నేషనల్ హైవేపై కిలోమీటర్ల పొడుగునా వడ్లు ఆరబోస్తున్నారు. రాత్రి పూట వడ్లను కుప్ప చేసి వర్షానికి తడవకుండా టాపర్లుకప్పి, గాలికి ఎగిరి పోకుండా బండరాళ్లు పెడుతున్నారు. రోడ్డు సగం వరకు ఆక్రమించి వడ్లు ఆరబోస్తుండగా రాత్రి వేళ కుప్పలు, బండరాళ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో పాటు, ప్రమాదాలు జరుగుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై సగం వరకు వడ్ల కుప్పలు ఉండడంతో ఒకే వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇది ప్రమాదాలకు దారి తీస్తోంది. గత వారం, పది రోజులుగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. కానీ ధాన్యం కాంటా పెట్టడం లేదు. ఈ కారణంగా పెద్ద మొత్తంలో ధాన్యం పేరుకుపోతోంది. కేంద్రాల వద్ద స్థలం సరిపోక చాలా మంది రైతులు వడ్లను రోడ్లపై ఆరబోస్తున్నారు.కాగా వడ్లు కొనుగోలు స్పీడ్ గా జరగడం లేదని, మరో వైపు వడ్లు అరబోయడానికి తమకు స్థలం లేదని, అందుకే ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా రోడ్ల పై వడ్లను అరబోసుకుంటున్నామని అంటున్నారు రైతులు. ఇలా రోడ్డు పై వడ్లు పోసి వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూలీలను సైతం ఏర్పాటు చేస్తున్నాం అని, వారికి రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే మాకు ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు రైతులు.