రోడెక్కిన పోలీస్ కుటుంబాలు

సిరా న్యూస్,కరీంనగర్;
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. పోలీస్ అధికారుల తీరు, ప్రభుత్వ విధానంపై మండిపడుతు ఆందోళనకు దిగారు. పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇంటికి రాకుండా పని చేయడం ఇదేం పోలీస్ డ్యూటీలని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన కలకలం సృష్టించడంతో పోలీసులు ఆందోళనకు దిగినవారిని అదుపులోకి తీసుకుని వదిలేశారు.‌రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ ఉంది.‌ అందులో పని చేసే కానిస్టేబుళ్ళ భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 40 మంది కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు ఆకస్మాత్తుగా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. డ్యూటీ పేరిట కూలీ పనులు, చెత్త ఏరడం, మట్టి పనులు చెపిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబందం లేదన్నారు. డ్యూటీ పేరుతో ఇంటికి రాకపోవడంతో కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగం అంటే పెళ్ళి చేసుకున్నామని తీరా చూస్తే కూలీల కంటే అద్వానంగా పనిచేస్తున్నారని ఆవేధన చెందారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆ విధానం ఇక్కడ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే పోలీసు విధానం ఉండాలని కోరారు. న్యాయం జరిగే వరకు కదలబోమని భీష్మించారు.కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళనతో పోలీస్ అధికారులు ఆగమాగం అయ్యారు. వెంటనే ఆందోళనకారుల వద్దకు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినలేదు. భార్యా పిల్లలను వదిలి కానిస్టేబుళ్ళ మాదిరిగానే అధికారులు పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు.‌ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి…. కానీ ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదని అధికారులు సూచించినప్పటికీ కానిస్టేబుల్ భార్యలు కుటుంబ సభ్యులు ససేమిరా అంటు ఆందోళన చేశారు.‌ చివరకు చేసేది ఏమీ లేక పోలీసులు ఆందోళనకు దిగిన కానిస్టేబుళ్ల భార్యలు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని బెటాలియన్ కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.ఆందోళనకు దిగిన కానిస్టేబుల్ భార్య లు తీవ్ర ఆగ్రహం, ఆవేశంతో మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం అంటే పెళ్ళి చేసుకున్నామని తెలిపారు. డ్యూటీ పేరుతో కూలీ పని చేస్తారని అనుకోలేదన్నారు. నిత్యం డ్యూటీ పేరుతో బెటాలియన్ లోనే ఉండడంతో ఇంట్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి రాకుండా పని చేయడంతో కుటుంబ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అందరి సమస్యలు పరిష్కరించే పోలీసులు, పోలీస్ కుటుంబాల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.‌ ఇప్పటికైనా వెట్టి చాకిరి చేయించడం మాని, ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే పోలీసుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళనతో పోలీస్ అధికారులు హైరానా కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఆరోపించిన వెట్టిచాకిరిపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. అంతర్గతంగా జరిగే పనులు విషయం బహిర్గతం కావడంపై కానిస్టేబుళ్ళను సుతిమెత్తగా మందలించి ఇంకోసారి ఆందోళన దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *