సిరా న్యూస్,హైదరాబాద్;
శాసనమండలిలో ఉన్న పార్టీ సభ్యులను అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోవడానికి భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది.మరికొద్ది రోజుల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీల సేవలను వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి మెజార్టీ ఉన్న నేపథ్యంలో మండలిలో అధికార పక్షాన్నిసాధ్యమైనంత మేరకు ఇరకాటంలో పెట్టడానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు గులాబిపార్టీ కీలక నేతలు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కు శాసనమండలిలో పూర్తిస్థాయిలో బలం ఉంది.సభలో మొత్తం 28/40 మంది సభ్యులు ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే పార్టీ బలోపేతం అవుతుందనేది పార్టీ ఆలోచనగ తెలుస్తోంది. అదికార పార్టీని కూడా సభలో తిప్పలు పెట్టడానికి అవకాశం ఉంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం శాసనమండలి సభ్యులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందనేది పార్టీ ఆలోచన. అందులో భాగంగా ఎమ్మెల్సీలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇటీవల కేటీఆర్ సమావేశమయ్యారు.
ఇన్నాళ్ల పాటు ఎమ్మెల్యేలే కీలకమై పార్టీ కార్యకలాపాల్లో చక్రం తిప్పారని, దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలు బయటపడ్డాయని బహిరంగంగానే నోరువిప్పారు కేటీఆర్ ఎదుట పార్టీ శ్రేణులు.అన్ని స్థాయిల వారిని కలుపుకుని వెళ్లేలా కార్యక్రమాలు ఇప్పటి నుంచి పార్టీలో ఉంటాయని కేటీఆర్ పార్లమెంట్ స్థాయి సమావేశాల్లో స్పష్టంచేయడం కూడా జరిగింది. గ్రామస్థాయి మొదలు పొలిట్ బ్యూరో వరకు కొత్తగా సమర్థులైన నాయకులను నియమించాలని అధినేత నిర్ణయించినట్లు తెలిపారు.సమర్థులైన నాయకులు, కార్యకర్తలకు కమిటీల్లో చోటు దక్కుతుందని కూడా కేటీఆర్ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు.పార్టీ శాసనసభ్యులు లేని నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నాయకులకు సూచించారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని పదేపదే చెబుతున్నారు.ఎమ్మెల్సీలుగా ప్రోటొకాల్ ఉంటుందని, తద్వారా ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించడం సులభం అవుతుందని అధినేత ఆలోచనగ తెలుస్తోంది. శాసన మండలిలో పూర్తి బలం ఉన్నందున బడ్జెట్ సమావేశాల సందర్భంగా వీలైనంత ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకుని పార్టీ విధానాలను బలంగా వివరించాలని కేటీఆర్ ఎమ్మెల్సీలను కోరుతున్నారు.
అధికారపార్టీ సభ్యుల ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టే విదంగా ముందస్తు ప్రణాళికలు ఉండాలి.సమావేశాలు సహా అన్ని సందర్భాలలో ఎమ్మెల్సీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని, పార్టీ తరపున అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కేటీఆర్ పార్టీ సభ్యులకు భరోసా ఇస్తున్నారు. మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతకు ప్రతిపక్ష హోదా తప్పనిసరి.బిఆర్ఎస్ నేత ఎంపిక నిర్ణయాన్నిప్రస్తుతానికి వాయిదా వేశారు.మరికొద్ది రోజుల్లోనే పార్టీ ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ సమావేశం అవుతారని,అప్పుడే మండలి పక్షనేత ఎంపిక కూడా ఉంటుందని కేటీఆర్ పార్టీ సమావేశాల్లో వెల్లడించినట్టు సమాచారం.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీలను సమన్వయకర్తలుగా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.అయితే సమన్వయకర్తలుగా నియమించి చేతులు దులుపుకుంటే ఫలితం ఉండదని కొందరు ఎమ్మెల్సీలు,కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది.పార్లమెంట్ స్థానాల్లో ఎమ్మెల్సీ లను నియమించి పూర్తిస్థాయి భాద్యతలను అప్పగించిన నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడటం కొసమెరుపు.