సిరా న్యూస్,మెదక్;
ఆరుగాలం శ్రమించే రైతులను నిండా ముంచారు. అబద్దాలతో అరచేతిలో వైకుంఠం చూపించి వారి భూములను కారుచౌకగా కొట్టేశారు. ఇలా సేకరించిన వేలాది ఎకరాల భూమిని అందమైన బ్రోచర్లు, కనువిందు చేసే ప్రాజెక్టు వీడియోలతో గుంటల లెక్కన ఫామ్‌లాండ్స్‌గా మార్చి మధ్యతరగతికి అంటగట్టేశారు. మొక్కల పెంపకం, రిసార్ట్స్ నిర్మాణం అంటూ మాయమాటలు చెప్పి వేలకోట్లు కూడబెట్టుకున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. పేద రైతులకు పంట పెట్టుబడిగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తు్న్న రైతు బంధు లక్ష్యానికి తూట్లు పొడుస్తూ.. ఆ సాయాన్ని అనర్హులకు అందేలా చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. జనతా, న్యూ లీఫ్ ఎకో ఫామ్స్, క్రీక్ సైడ్ ఫామ్ ల్యాండ్, గ్రీన్ వ్యాలీ, నీమ్స్ బోరో, జీఎస్ఆర్ ఇన్ఫ్రా.. ఒక్కటేమిటి.. ఇలా వందలాది కంపెనీలు, ఆ కంపెనీల వెనక కొందరు రాజకీయ ప్రముఖులు చేస్తున్న చీకటి వ్యాపారంతో .. నేటికీ రైతుబంధు పథకం నిర్వీర్యం అవుతూనే ఉంది.జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్.. గతంలో ఇక్కడ మెగా ఫుడ్ ప్రాజెక్టు పేరుతో పేద రైతుల భూములను కారుచౌకగా కొట్టేశారు. ముఖ్యంగా కర్ణాటక – తెలంగాణ సరిహద్దులోని రైతుల నుంచి ఈయన గారు సుమారు 500 ఎకరాల భూమిని ఎకరం రూ. 10 వేల మొదలు లక్ష రూపాయల లెక్కన కొనుగోలు చేశారు. తెలంగాణలో ఎక్కడైనా పది లక్షల లోపు భూమి దొరకటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో నిరుపేదలను మాయచేసి వారి భూముల రిజిస్టర్ చేయించుకున్నారు. తర్వాత అక్కడ మెగా ఫుడ్ ప్రాజెక్టు రాకపోవటంతో నాటి ఎంపీ మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు.. తమ భూములను కారుచౌకగా కొట్టేసి, ఆయన వ్యాపారం చేసుకుంటున్నారనే అసలు వాస్తవమూ బయటికి వచ్చింది.పేద రైతుల భూములను పెద్దల పరం కావటంలో బ్రోకర్ కనకరాజు చక్రం తిప్పాడు. బీబీ పాటిల్, నారాయణ్ ఖేడ్ సమీప ప్రాంతంలో పదుల సంఖ్యలో ఫామ్‌లాండ్స్ కంపెనీలు వేలాది ఎకరాలు కొనుగోలులో ఇతగాడి పాత్ర ఉంది. జోగిపేట- నారాయణఖేడ్ మధ్యలోని ఓ కుగ్రామంలో పుట్టి, సాధారణ రియల్ ఎస్టేట్ బ్రోకరుగా జీవితాన్ని ప్రారంభించిన కనకరాజు.. బ్రోకరిజానికి కొత్త అర్థాలు నేర్పాడు. కొవిడ్ తర్వాత నగర శివారులో ఫామ్‌లాండ్స్, ఫామ్‌హౌస్ కల్చర్ పెరగటంతో దీనిని కనకరాజు కొత్త వ్యాపారసూత్రంగా మలచుకున్నాడు. పెద్దలు కారుచౌకగా కొనుగోలు చేసిన భూములను.. గుంటల లెక్కన అమ్మటానికి రంగం సిద్ధం చేశాడు. అందమైన లేవుట్స్, కన్నుచెదిరే వీడియోలు తీయించి.. ఎకరం లక్షకు కొన్న భూములను 5 గుంటలు.. 2 లక్షల లెక్కన మార్కెటింగ్ ఏజెంట్లను పెట్టి అమ్మించాడు. ఇందులో మొక్కలు పెంచుతామని, అది అదనపు ఆదాయమని నమ్మబలకటమే గాక.. రైతుబంధు, రైతుబీమా సాయం అందిస్తామని ప్రచారాన్ని జోరుగా చేశారు. అంతేకాదు.. పెద్దల భూములు అమ్మే క్రమంలో లీగల్ సమస్యలు రాకుండా కనకరాజు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రసీదుల మీద ఉండే అడ్రస్‌లు, కాగితాల మీద ఉండే పేర్లు అతగాడి మందుచూపుకు నిదర్శనం. మొత్తానికి ఇటు కమిషన్లు, అటు పెద్దల దగ్గర పొందిన వ్యాపార వాటాలతో ఒకనాటి ఏజెంట్ కనకరాజు.. నేడు కోట్లకు పడగలెత్తేశాడు.నారాయణ్ ఖేడ్ సమీప ప్రాంతాల్లో పదో తరగతి చదివి ఖాళీగా ఉన్న నిరుపేద విద్యార్థులను టార్గెట్ చేసుకున్న కనకరాజు.. వారికి ఉద్యోగాలిస్తానంటూ పిలిపించి నిలువునా ముంచినవైనమూ ఇప్పడు బయటికి వస్తోంది. ఇలా వచ్చిన విద్యార్థుల్లో మేజర్లను గుర్తించి, వారి పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేయించి, తర్వాత చెక్ బౌన్స్ వంటి ఏదైనా లీగల్ సమస్యలు వస్తే.. సడన్‌గా కనకరాజు ముఖం చాటేసేవాడు. ఉద్యోగమని పోయి.. తర్వాత కేసుల్లో ఇరుక్కుని ఎందరో యువకులు కోర్టులకు తిరగాల్సిన దుస్థితి. అంతేకాదు.. ఈ యువకులు రోజంతా తిరిగి పబ్లిసిటీ చేసినా నెలాఖరు జీతాలు మాత్రం ఇచ్చేవాడు కాదు. ఇదేంటని నిలదీసిన వారికి రూపాయి కూడా ఇవ్వకుండా పంపేశాడు. ఇదేకాదు.. ఒక్క ఫ్లాట్ బుక్ చేయిస్తే కమీషన్ వస్తుందన్న ఆశతో అనేకమంది స్థానిక యువకులు రోజుల తరబడి కష్టపడి ఒకరిద్దరు కస్టమర్లను తీసుకు వస్తే.. కస్టమర్ పేరిట ఫ్లాట్ రిజిష్టర్ కాగానే, ఈ యువకులకు ఇవ్వాల్సిన కమీషన్ ఎగ్గొట్టిన ఘనుడు ఈ కనకరాజు. ఒకవైపు, కోట్లకు పడగలెత్తి, తమ కళ్లముందు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ.. తమకివ్వాల్సిన నాలుగైదు వేల కమీషన్‌నూ కాజేశాడని సదరు యువకులంతా వాపోతున్నారు.సేల్స్ కంపెనీలకు, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే వారికి పార్ట్ టైమ్ ఆదాయం అంటూ.. వాహనాల్లో వెంచర్ల వద్దకు తీసుకుపోయి.. యాభై ఎకరాల్లో తిప్పి, కనుచూపు మేర ఉన్న వెయ్యి ఎకరాలు మనదేనంటూ వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అంతే కాదు.. ఒక ఫ్లాట్ అమ్మితే.. 30 శాతం కమీషన్ ఆఫర్ చేశారు. దీంతో వీరంతా ‘5 గుంటల ఫ్లాట్.. రూ. 2 లక్షలకే. హైదరాబాద్ శివారులో మీకంటూ ఒక సొంత ఫ్లాట్. చందనపు మొక్కలు మేమే పెంచి మీకిస్తామంటూ ఆఫర్. ఆరు నెలలకోసారి రైతుబంధు, పీఎం కిసాన్ నిధులు, రైతు బీమా. సర్వహక్కులతో ప్రత్యేక పాస్‌బుక్ ఇచ్చే బాధ్యత మాది’ వంటి ప్రచారం చేసేలా కనకరాజు, మరో నలుగురు కలిసి ప్లాన్ చేశారు. దీంతో కమిషన్ కోసం ఏజెంట్లు.. శని, ఆదివారాల్లో వందలమంది కస్టమర్లను విహారయాత్రలా తీసుకుపోవటం, మంచి భోజనం పెట్టి, బ్రోచర్లుచేతిలో పెట్టి, స్పెషల్ వీడియో ప్రజంటేషన్ ఇచ్చి.. కమిట్ చేయించి, అతి తక్కువ సమయంలో వందల ఎకరాల్లో వేసిన ఫామ్‌లాండ్స్ అమ్మేశారు. ఈ దందా సాఫీగా జరగటం వెనక మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర కూడా ఉంది.తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ యాక్ట్ 1956 , సెక్షన్ 4 ప్రకారం… వ్యవసాయ భూమిగా పేర్కొనే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని విస్తీర్ణం కనీసం 20 గుంటలు ఉండాలి. కానీ, నాటి ప్రభుత్వంలోని మంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అక్రమ లేఅవుట్లలోని స్థలాలను కొనుగోలు చేసినవారికి రిజిస్ర్టేషన్లు రెవెన్యూ కార్యాలయంలో ధరణిలో తహసీల్దార్లు చేసేపారేశారు. ఒక గుంట భూమి రిజిస్ర్టేషన్ చేసినా కొత్త రెవెన్యూ సంస్కరణల ప్రకారం.. కొనుగోలుదారుడికి పట్టా పాస్ బుక్ రావటం, రైతుబంధు, పీఎం కిసాన్ నిధులు రావటం మొదలైంది. దీనికి తోడు.. ఫామ్‌ల్యాండ్ లేఅవుట్లపై స్పష్టమైన పాలసీ లేకపోవటం ఫామ్ ల్యాండ్ కంపెనీలకు వరంగా మారింది.ఈ అక్రమార్కులు దందా కారణంగా పేద రైతుల కోసం పెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాల నిధులు అనర్హుల పాలయ్యాయి. ఏటా రూ. 300 కోట్ల చొప్పున ఇన్నేళ్లుగా ఖజానాకు చిల్లుపడుతూ వచ్చింది. సుమారు 18 లక్షల మంది రైతుల భూముల ఫామ్‌లాండ్స్‌గా మారాయని, తెలంగాణలో 2 లక్షల ఎకరాలు ఈ లెక్కన వ్యవసాయభూమి ఫామ్‌లాండ్ రూపంలోకి మారిందని గణాంకాలు చెబుతున్నాయి.
సర్కారు ప్రస్తుత లెక్కలు
భూమి రైతుల సంఖ్య
ఎకరం లోపు 24.24 లక్షలు
2 ఎకరాల లోపు 18 లక్షలు
3 ఎకరాల లోపు 11. 31 లక్షలు
4 ఎకరాల లోపు 6.55 లక్షలు
5 ఎకరాల లోపు 5 లక్షలు
5 ఎకరాల పైన 4.5 లక్షలు