పాపం.. జవహర్ రెడ్డి

సిరా న్యూస్,విజయవాడ;

ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి. దాదాపు అన్ని ప్రభుత్వాల్లో ఆయన పనిచేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. అటు రాజకీయాలకు అతీతంగా నడుచుకునేవారు. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత వన్ సైడ్ అయ్యారు. జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు పదవీ విరమణ ముందు అవే వివాదం అవుతున్నాయి. మున్ముందు ఆ కేసులు వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో నెల రోజుల్లో సి ఎస్ జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆయనపై ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో అసైన్డ్ భూముల కొనుగోలు వెనుక తన కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో సి ఎస్ జీవో జారీ వెనుక ఉన్న తతంగం కొంతమంది అధికారులకు తెలుసు. కానీ వారంతా సిఎస్ కు అస్మదీయలే. అయితే ఎక్కడో తేడా కొట్టింది. వారు ఇప్పుడు విపక్షాలకు సమాచారం ఇచ్చారు. పూర్తి ఆధారాలను అందించారు. అప్పటినుంచి సి ఎస్ జవహర్ రెడ్డి చుట్టూ వివాదం అలుముకుంది. నేరుగా సిఎస్ పైనే విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో పదవీ విరమణ ముందు జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. కానీ తాను ఇన్నాళ్లు నమ్ముకున్న వైసిపి నేతల నుంచి కూడా ఆశించిన సహకారం ఆయనకు అందడం లేదు.సిఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడికి మంచి వ్యాపార జీవితం ఇవ్వాలని భావించారు. సగటు తండ్రిగా అది తప్పులేదు. ముందుగా ఆయనను మైనింగ్ వ్యాపారం లోకి దించారు. తరువాత ఇప్పుడు భూముల కొనుగోలు వ్యవహారం అప్పగించారు. అయితే సీఎస్ గా బాధ్యత తీసుకున్న నాటి నుంచే జగన్ సర్కార్కు వీర విధేయుడుగా మారిపోయారు అన్న ఆరోపణ ఆయనపై ఉంది. పైగా వైసీపీ అంటేనే వ్యాపారాలకు అనుకూలం అన్న పేరు ఉంది. దీంతో అడ్డగోలు జీవోలతో వైసీపీ నేతలకు సహకరించారన్న ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఈ తరుణంలో తన కుమారుడి కోసం ప్రభుత్వపరంగా సిఎస్ జవహర్ రెడ్డి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో నెలలో పదవీ విరమణ పొందుతుండగా ఈ తరహా ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ జిల్లాలో దళితుల భూములను సిఎస్ జవహర్ రెడ్డి కుటుంబం కొల్లగొట్టింది అని జనసేన నుంచి ఆరోపణలు వచ్చాయి. విశాఖకు చెందిన ఆ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై జవహర్ రెడ్డి నొచ్చుకున్నారు. మూర్తి యాదవ్ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో విలువైన భూములను జవహర్ రెడ్డి కుటుంబం కారు చౌకగా కొట్టేసిందని టిడిపి నాయకులు ఆరోపించడం ప్రారంభించారు. దీంతో సిఎస్ జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారు. టిడిపి నేతల ఆరోపణల కంటే.. వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం దక్కకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.వాస్తవానికి జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. తొలుత టీటీడీలోకి జగన్ జవహర్ రెడ్డిని తీసుకున్నారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో జవహర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు జగన్. ఒకవైపు వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తూనే.. టీటీడీని మాత్రం విడిచిపెట్టలేదన్న విమర్శ జవహర్ రెడ్డి పై ఉండేది. అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంతోమంది సీనియర్లు బరిలో ఉండగా… జగన్ మాత్రం జవహర్ రెడ్డి ని ఎంపిక చేశారు. అస్మదీయ అధికారిగా జవహర్ రెడ్డి నిలిచారన్నది యంత్రాంగంలో ఉన్న ఆరోపణ. జగన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నా అడ్డు చెప్పలేని పరిస్థితి ఆయనది. గత కొద్ది రోజులుగా జగన్ సర్కార్కు అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో జవహర్ రెడ్డి ముందుండే వారన్నది ఆయన పై ఉన్న ఆరోపణ. చివరకు పోలింగ్ కు ముందు పింఛన్ల పంపిణీలో సైతం వైసీపీ సర్కార్ కు అనుకూలంగా పనిచేశారన్నది విపక్షాల నుంచి వచ్చిన ఆరోపణ. ఇప్పుడు అదే విపక్షాల నుంచి జవహర్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు వస్తున్నా ఖండించలేని స్థితిలో వైసిపి ఉంది. దీంతో జవహర్ రెడ్డి సైతం బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నా.. తిప్పి కొట్టడంలో మాత్రం వైసిపి నుంచి సహకారం అందకపోవడం ఆయనలో ఉన్న ఆవేదనకు కారణం అవుతోంది.గతంలో చాలామంది అధికారులకు ఎదురైన పరిణామాలే.. జవహర్ రెడ్డి ఎదుర్కోక తప్పదు. ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే పర్వాలేదు. లేకుంటే మాత్రం జవహర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఎక్కువగా ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *