సిరా న్యూస్, కందుర్తి:
బాల్య వివాహాలు అరికడదాం… ఆడబిడ్డలను కాపాడుదాం….
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామంలో స్థానిక ఉన్నత పాఠశాల లో ఆర్.డి.టి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ అందరి భాద్యత అనే కార్యక్రమం ఆర్ డి టి టీం లీడర్ ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా చిన్నారులకు లఘుచిత్రాల ద్వారా ప్రస్తుతం సమాజంలో ఎదురైయ్యే బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు వంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారి వనజ అక్కమ్మ మాట్లాడుతూ… తల్లిదండ్రులు అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనే భావన పక్కన పెట్టి ఇద్దరు సమానమే అని బావించి సరైన సహకారం అందించి ప్రోత్సహిస్తే ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తారని అన్నారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అమ్మాయిలు మానసిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహాలు చేయడం ఉత్తమము అని అన్నారు. బాల్య వివాహాలు చేస్తే, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహం చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన, హాజరైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు అవుతారని అన్నారు. ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు కనిపిస్తే, నిరోధానికి టోల్ ప్రీ నంబర్లు 1098, 100 మరియు 112 లకు సమాచారం అందిస్తే పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మినరసప్ప, ఐ.సి.డి.ఎస్ సూపర్వైసర్ జ్యోతిలక్ష్మి, ఆర్ డి టి కౌన్సెలర్నా రాయణమ్మ, ఆర్ డి టి సి ఓ నరసింహప్ప, మహిళా పోలీస్ అధికారి సుజాత, వైద్య సిబ్బంది అలివేలమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.