సిరా న్యూస్,ముంబై;
దేశంలో సైబర్ మోసగాళ్లు మితిమీరిపోతున్నారు. కొత్త కొత్త దారుల్లో పౌరులను మోసం చేసి భారీగా దోచుకుంటున్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనే కొత్త విధానంలో పౌరులను ఫోన్ చేసి ఉక్కిరి బిక్కిరి చేసి వారి వద్ద నుంచి ఉన్న ధనం మొత్తం ఆన్ లైన్ ద్వారా దోచేసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే రూ.120 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని తాజాగా ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది.జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసుల్లో భారతదేశంలోని పౌరులు రూ.120.3 కోట్లు నష్టపోయారని ఈ నివేదిక తెలిపింది. ఈ విషయం చాలా సీరియస్ అని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తన రెగులర్ రేడియో కార్యక్రమం అయిన మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ లో చెప్పారు. అక్టోబర్ 27న ప్రసారం అయిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా మోసాలు, స్కాములు చేస్తున్నారని.. దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.జనవరి నుంచి ఏప్రిల్ 2024 వరకు మొత్తం 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదుల వచ్చినట్లు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) తన నివేదికలో తెలిపింది. 2023 సంవత్సరంలో 15.56 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు రాగా.. ఈ సంఖ్య 2022లో 9.66 లక్షలు, 2021లో 4.52 లక్షలుగా ఉంది.ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ సిఈఓ రాజేష్ కుమార్ ప్రకారం.. గత మూడు సంవత్సరాల డేటా పరిశీలిస్తే.. ఇందులో రూ.1420.48 కోట్ల ట్రేడింగ్ స్కామ్‌లు, రూ.222.58 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, రూ.13.23 కోట్ల హనీ ట్రాప్, డేటింగ్ స్కామ్‌ల కేసులున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్యులను ఆన్ లైన్ ద్వారా ఒత్తిడి చేసి భారీగా డబ్బు దోచుకునే కొత్త మార్గం డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఇందులో ఒక వ్యక్తి సైబర్ మోసగాళ్లు ముందుగా ఫోన్ కాల్ చేస్తారు. ఫోన్ చేసిన వారు తాము ప్రభుత్వ అధికారులమని విచారణ కోసం ఫోన్ చేశామని చెబుతారు. తాము సిఐడి అధికారులు, ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఈడీ ఆఫీసర్లుగా పరిచయం చేసుకుంటారు. సదరు వ్యక్తి పేరు మీద నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని, లేదా వ్యక్తి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా హవాలా, మనీ లాండరింగ్ లాంటి నేరాలు జరుగుతున్నాయని భయపెడతారు.ఆ వ్యక్తి ఇదంతా విన్నాక.. కంగారుతో తాను ఏమీ చేయలేదని చెప్పినా.. ఆ నకిలీ ఆఫీసర్లు ఆ వ్యక్తిని ఇంటి నుంచి కదలకూడదని.. విచారణలో తమతో సహకరిస్తే.. వదిలేస్తామని చెబుతారు. మధ్యలో ఎవరితోనూ ఫోన్, చాటింగ్, మెసేజ్ ద్వారా మాట్లాడకూడదని షరతులు పెడతారు. దీంతో ఆ వ్యక్తి ఒక విధంగా తన ఇంట్లోనే ఖైదు అయిపోతాడు. చివరగా.. అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం చోరీ సొమ్ము అని చెప్పి.. ఆ డబ్బుని విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేయాలని.. విచారణ పూర్తి చేశాక తిరిగి ఇచ్చేస్తామని చెబుతారు. దీంతో సదరు వ్యక్తి భయపడి ముందు తన వద్ద ఉన్న మొత్తం డబ్బుని నకిలీ ఆఫీసర్లు చెప్పిన అకౌంట్ కు బదిలీ చేస్తాడు. ఇది జరిగిన వెంటనే ఫోన్ కట్ అవుతుంది. తరువాత సదరు వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఆ ఫోన్ నెంబర్లు పనిచేయవు.విచిత్రమేమిటంటే.. ఈ మధ్య ఆఫీసర్లుగా డ్రెస్, ఐడీ కార్డు ధరించి మరి.. సైబర్ మోసగాళ్లు ధైర్యంగా వీడియో కాల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్లు, కంపెనీ ఓనర్లు, కాస్త ధనవంతులనే వీరు టార్గెట్ చేస్తున్నారు. దోపిడీకి గురైన వారు లక్షలు, కోట్లలోనే మోసపోతున్నారు. ఈ సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా మయన్మార్, లావోస్, కంబోడియా దేశాల నుంచి కాల్ చేస్తున్నారని విచారణలో తెలిసింది.