భయపెడుతున్న పులులు

సిరా న్యూస్,నిజామాబాద్‌;
మూడు పులుల సంచారం అటు తెలంగాణ ప్రజలతో పాటు ఇటు మహారాష్ట్ర వాసులను వణికిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో పులులు సంచరిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగానది పరిసర ప్రాంతాల్లో మూడు పులులు కనిపించాయి. తెలంగాణ సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉన్న మహారాష్ట్ర సరిహద్దులోని రాంనగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించాయి. పులుల సంచార చిత్రాలను తన సెల్ ఫోన్ లో ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో మొత్తం సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి.మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం పెన్ గంగానది సరిహద్దులో తెలంగాణలోని ఆయా గ్రామాలకు అతి సమీపంలో ఉండటంతో తరచూ పులులు కనిపించడం… చలికాలంలో.. వేసవిలో పెన్ గంగానది దాటి భీంపూర్ మండల వైపు సంచరించడం సర్వసాధారణంగా మారింది. గత రెండేళ్లుగా పులులు వస్తూ.. పోతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందట నాలుగు పులులు.. ఓ తల్లి, దాని మూడు పిల్లలు భీంపూర్ మండలంలోని తాంసి(కే) గొల్లఘాట్, పిప్పల్ కోటి శివారులో సంచరించి ఆవాసం ఏర్పర్చుకున్నాయి. అప్పుడు పదుల సంఖ్యలో పశువులపై దాడులు చేసి హతమార్చాయి. మూడు నెలల తరువాత అవీ మళ్లీ యధావిధిగా తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్లిపోయాయి. గత ఏడాది సైతం రెండు పులులు అలాగే సంచరించి పలు పశువులను హతమర్చాయి. మళ్లీ యధావిధిగా అవి తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్ళిపోయాయి. భీంపూర్ మండలంలోని తాంసి (కే) గొల్లఘాట్ తర్వాత తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు పెన్ గంగానదిని ఆనుకునే తిప్పేశ్వర్ అభయారణ్యం ఉండడంతో పులుల రాక సర్వసాధారణమే అవుతోంది. వాటికి ఇక్కడ ఏపుగా ఎత్తైన మహావీర మొక్కల మధ్య మంచి ఆవాసం ఉంటుంది. చలికాలంలో ఆడ,మగ పులులు కలయిక కోసం వెతుక్కుంటూ సైతం ఈ ప్రాంతానికి వస్తుంటాయి. రెండేళ్ల క్రితం ఓ తల్లి మూడు పిల్లలు మొత్తం నాలుగు పులులు భీంపూర్ మండల శివారులోకి వచ్చి ఈ ప్రాంతంలో ఏపుగా ఎత్తుగా ఉన్న మహావీర మొక్కల మద్య ఆవాసం ఏర్పరచుకొని, పులి పిల్లలకు తల్లి పులి వేటాడడం నేర్పించి తిరిగి అవి యధావిధిగా తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్లిపోయాయి. ఈ ప్రాంతము అంతా బఫర్ జోన్ ఏరియాలో ఉంది. ఇక్కడ దట్టమైన అటవీ అంతగా ఏమీ లేదు, కానీ.. పెన్ గంగానది సరిహద్దులో ఉండడం వల్ల వాటికి ఏపుగా పెరిగే మహావీర మొక్కలు ఈ బఫర్ జోన్ లో ఉండడం వల్ల ఇక్కడికి వాటి రాక తరచు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఈ పులుల ఫోటోలను చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఇంకా తెలంగాణ ప్రాంతంలోకి పులులు సంచరించలేదని, అవి పెన్ గంగానది అవతలి వైపే ఉన్నాయని, ఎంతకైనా సరే సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *