గైరు హాజరైన బడి పిల్లల పునః ప్రవేశానికి ప్రత్యేక చర్యలు
ప్రతి మండలానికి జిల్లా అధికారి హోదాలో స్పెషల్ అధికారి
5-18 సంవత్సరాల పిల్లలందరూ ఏదో ఒక విద్యాసంస్థలో ఉండాలి
జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
సిరా న్యూస్,
నంద్యాల;
గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో 100 శాతం పూర్తయి విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు గైరు హాజరు కాకుండా ఖచ్చితంగా పాఠశాలల్లోనే ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో నమోదుపై జిల్లా అధికారులు, సంబంధిత విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే 100 శాతం పూర్తయిన సందర్భంగా బడి ఈడు పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలల్లో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 5-18 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడి బయట ఉండకుండా పాఠశాలల్లో లేదా ఓపెన్ స్కూల్లో లేదా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏదో ఒక విద్యాసంస్థలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిఈఆర్ సర్వేపై త్వరలో కేంద్ర బృందం వెరిఫికేషన్ వున్న నేపథ్యంలో ముందస్తు సర్వేపై (PRE SURVY) జిల్లా అధికారులను మండల స్పెషల్ అధికారులుగా నియమించామన్నారు.
ప్రతి మండల స్పెషల్ అధికారి తమ పరిధిలోని బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు 30 గృహాలను ర్యాండమ్ తనిఖీ చేసి సూచించిన ప్రొఫార్మాలో పొందుపరిచి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే గుర్తించిన పిల్లలందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్నారు.