సిరా న్యూస్,ఒంగోలు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉన్న పేరెంట్స్ కమిటీల స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను నియమించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నిక ఆగస్టు 8న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు. 2021 సెప్టెంబర్ 22న ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను 2023 సెప్టెంబర్ 21తో రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాయి. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు కొనసాగించారు. ఆగస్టు 8న ఈ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని అన్ని జిల్లాల డీఈఓలు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్స్‌కు రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని పాఠశాల్లో (ప్రైవేట్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ మినహా) స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేశారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు ఉంటారు. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డులో పెట్టాలి. ఆగస్టు 5 (సోమవారం)న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటరు జాబితాపై ఏమైన అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఓటర్ల జాబితా పూర్తి చేసి నోటీస్ బోర్డులో పెట్టాలి.ఆగస్టు 8 (గురువారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించాలి. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీకి ఎన్నికైన సభ్యులతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించాలి. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య మొదటి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలి. ఎన్నికల నిర్వహించడానికి కనీసం 50 శాతం విద్యార్థులు తల్లిదండ్రులైన, సంరక్షకులైన వారు ఉండాలి. ఈ కమిటీకి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్‌గా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. అయితే ప్రధానోపాధ్యాయుడు ఓటు వేయడానికి అవకాశం లేదు.