సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది.. మంత్రులు కూడా దాదాపు ఖరారయ్యారు. అయితే, మంత్రుల కంటే ముందు స్పీకర్ ఎవరు అనేది తేలాల్సి ఉంది. స్పీకర్ పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదట కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు. సీనియర్ నేతలంతా తమకు స్పీకర్ పదవి వద్దంటే వద్దు అని దూరం జరుగుతున్నారట. స్పీకర్‌గా పని చేస్తే మళ్లీ గెలవరనే ఒక విశ్వాసం రాజకీయ నేతల్లో గాఢంగా ఉంది. గతంలో స్పీకర్‌గా పని చేసిన వారంతా ఓడిపోయారే తప్ప.. ఎన్నడూ గెలిచిన దాఖలాలు లేవు. అయితే, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆ మూఢ నమ్మకాన్ని బ్రేక్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఏది ఏమైనా.. స్పీకర్‌గా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోచారం గెలుపును ఉదాహరణగా చూపించినా.. మాకు వద్దే వద్దంటున్నారు నేతలు. స్పీకర్ పదవి ప్రచారంలో తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, శ్రీధర్ బాబు, రాజనర్సింహ తమకు స్పీకర్ వద్దంటే వద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో మంత్రి పదవులు దక్కి వారి లిస్ట్‌లో భట్టి విక్రమార్క, కూనంనేని సాంబశివరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండటంతో.. తుమ్మల నాగేశ్వరరావుకే స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్‌లో కాంగ్రెస్ గెలుపొంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది. మంత్రులు పేర్లను కూడా దాదాపు ఫైనల్ చేసింది. గురువారం నాడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, స్పీకర్ పదవి విషయంలోనే తేడా వస్తోంది. ఈ పదవిని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. మరి చివరకు ఆ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఆరు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచారు. అయితే వీళ్లు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామ చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏకంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అంతేకాదు ప్రస్తుతం గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపితే ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎల్బీస్టేడియంలో రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎమ్మెల్సీగా రేవంత్ ఎవరికి అవకాశం ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఎమ్మెల్సీ రేసులో షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్‌తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సీపీఐ నేతలకు కూడా అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది.