యాదాద్రి ప్లాంట్ లో వరుస దొంగతనాలు…

సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లాలో కడుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ వరుసగా చోరీలు జరుగుతున్నాయి. కోట్ల విలువైన మెటీరియల్ పక్కదారి పడుతోంది. నిర్మాణ పనుల కోసం..విలువైన ఐరన్, అల్యూమినియం, రాగి ఇతర సామాగ్రి వేల టన్నుల మెటీరియల్ వాడుతున్నారు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి సామాగ్రిని తెప్పించి ప్లాంట్ దగ్గరలో నిల్వ చేస్తున్నారు. ఆ మెటీరియల్ భద్రత కోసం వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. గతేడాది నుంచి స్థానిక పోలీసులను కాదని.. భద్రతను SPFకు అప్పగించారు. పర్యవేక్షణ చేసేందుకు ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐ స్థాయి అధికారులు, 40 మంది సిబ్బందిని ఉంటున్నారు.ఇంత టైట్‌ సెక్యూరిటీ ఉన్నా..యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోకి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. ఎవర్నీ కూడా ప్రధాన గేటు లోపలికి కూడా అనుమతించరు. లోపలికి వచ్చేవారి..వెళ్లేవారి వివరాలు అన్ని రికార్డవుతాయి. మీడియాను కూడా గేట్ దగ్గరే ఆపివేస్తారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా..కోట్ల విలువ చేసే మెటీరియల్‌ చోరీకి గురవడం చర్చనీయాంశంగా మారింది.కొందరు ప్లాంట్‌ సిబ్బంది సహకారంతో అక్రమార్కులు ముఠాగా ఏర్పడి విలువైన సామగ్రిని తరలిస్తూ కోట్ల రూపాయలను జేబుల్లో నింపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మే నెలలో విలువైన అల్యూమినియం షీట్లను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 6 కోట్ల విలువైన సామాగ్రిని పక్కదారి పట్టించినట్లు అంచనా వేశారు. వారి నుంచి 71 లక్షల మెటీరియల్, 20 లక్షల విలువైన కారు, ఆటో, 58 లక్షల నగదుతో కలిపి మొత్తం 1.49 కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.లేటెస్ట్‌గా ప్లాంట్‌లో మళ్ళీ మెటీరియల్ చోరీ జరిగింది. ప్లాంట్ నుంచి ఐరన్, అల్యూమినియం, ఇతర మెటీరియల్‌ను చోరీ చేసి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడి యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి ఐరన్, అల్యూమినియం, ఇతర విలువైన మెటీరియల్‌ను తరలిస్తున్నట్లు చెబుతున్నారు.థర్మల్ పవర్ ప్లాంట్ పనులను దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగులు, కొందరు ఇంజనీర్లు..దొంగల ముఠాతో కుమ్మక్కై ఐరన్, అల్యూమినియం చోరీ చేసి..ఐరన్ స్ర్కాప్ వ్యాపారులకు అమ్ముతున్నట్లు పోలీస్‌ విచారణలో తేలింది. మిర్యాలగూడలోని ఓ ఐరన్ స్క్రాప్ షాప్‌ యజమాని యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి చోరీ చేసిన మెటీరియల్ కొంటున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ దొంగల ముఠాతో పాటు మెటీరియల్ కొంటున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.ప్లాంట్ నుంచి రెండేళ్లుగా అల్యూమినియం, బ్రాస్, జిఐ బండిల్స్ సహా ఇతర మెటీరియల్ చోరీ అవుతోంది. ప్లాంట్‌లోని ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగులు.. అక్రమార్కులతో కలిసి మెటీరియల్ చోరీకి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పలుమార్లు మెటీరియల్ దొంగతనం జరిగినట్లు BHEL ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నడుమ ఉన్న స్టోర్ యార్డ్ నుంచి భారీ స్థాయిలో మెటీరియల్ పక్కదారి పడుతుంటే అధికారులు, సిబ్బంది గుర్తించలేకపోవడం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనక పలువురు అధికారులతో పాటు భద్రతా సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దొంగిలించిన మెటీరియల్ అమ్మేయగా వచ్చిన డబ్బులతోనే అందరినీ మేనేజ్ చేసి తప్పించుకున్నారట.అందుకే అసలు నిందితులను వదిలేసి కేవలం మెటిరియల్ తరలిస్తున్న వారిని.. కొనుగోలు చేసేవారు మాత్రమే అరెస్ట్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. ప్లాంట్ నుంచి ఇప్పటికే దాదాపు 7 కోట్ల విలువైన మెటీరియల్ మాయమైనట్లు అధికారిక ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. కానీ చోరీ అయిన మెటీరియల్ విలువ 20 కోట్ల నుంచి 30 కోట్లకుపైగా ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందాపై సమగ్ర దర్యాప్తు చేసి అసలు గుట్టు విప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన్న సామెత తెలిసిందే. ఇప్పుడా ఇంటి దొంగను కనిపెట్టే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మెటీరియల్ పక్కదారి పట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పెట్టినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *