సచివాలయాల భవిష్యత్తుపై నీలినీడలు

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి విధులు లేకపోవడంతో వాటిని ప్రక్షాళన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పెన్షన్ల పంపిణీ మాత్రమే సచివాలయ సిబ్బంది చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌‌లో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్టోబర్ 2 నుంచి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో ఎనిమిది నుంచి పది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వైసీపీ హయంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో పాటు సంక్షేమ పథకాల అమలులో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాయి.
ప్రతి సచివాలయం పరిధిలో సగటున 1500-2వేల కుటుంబాలు లేదా గరిష్టంగా 4-5 వేల జనాభాను విభజించి కేటాయించారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించారు.
ఏపీపీఎస్సీ నియామకం ద్వారా లక్షా 30వేల మంది శాశ్వత ఉద్యోగులను సచివాలయాల్లో విధుల కోసం నియమించారు. వైసీపీ హయంలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాలంటీర్ల ద్వారా సచివాలయాల పర్యవేక్షణలో అందించేవారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను నిలిపివేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో దాదాపు లక్షమంది స్వచ్ఛంధంగా, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేశారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు అమలు చేసిన దాదాపు 23 సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగలకు చేయడానికి పనేమి లేకుండా పోయింది.
2019లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు రూపకల్పన చేసినపుడు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ నిబంధనలు, పదోన్నతులు, విధుల కేటాయింపు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నియామకాలు పూర్తి చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన తర్వాత వారు ఏ శాఖ పరిధిలోకి వస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసినా విధుల నిర్వహణకు, మాతృ విభాగానికి ఎలాంటి సంబంధం లేదు.
ఉద్యోగుల నియామకం, వారి ప్రొబేషన్ పీరియడ్‌ కాలం పూర్తైన పది నెలలకు కానీ సర్వీస్ క్రమబద్దీకరించలేదు. ఉద్యోగ నియామకాలు రెండు విడతల్లో జరిగినా మొదట చేరిన వారు సీనియారిటీ కోల్పోయారు.
గత నాలుగు నెలలుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేయడానికి ఎలాంటి విధులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు తమకు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పంచాయితీల్లో కానీ పట్టణాల్లో మునిసిపాలిటీ, లైన్‌ డిపార్ట్‌మెంట్లలో అనుసంధానించాలనే ప్రతిపాదన ఉంది.
సచివాలయాలను ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగించడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పంచాయితీల అధికారాలను హరించేలా ఉన్న సచివాలయాలను పంచాయితీల్లో విలీనం చేయాలని ఏపీ పంచాయితీరాజ్‌ ఛాంబర్‌ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు, నాయకుల చేతుల్లో సచివాలయాలు చిక్కుకుని పౌర సేవల్ని అందించడంలో రాజకీయ ప్రమేయం ఎక్కువైందనే విమర్శల్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
సచివాలయాల ద్వారా పాలనలో, పౌర సేవల్లో ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు జరిగాయి, ప్రజలకు మేలు జరిగిందా, నష్టం జరిగిందా అనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతోంది. జవాబుదారీతనంతో కూడిన పౌర సేవల్ని అందించడంలో సచివాలయ వ్యవస్థ విఫలమైందనే అభిప్రాయం ప్రజా ప్రతినిధుల్లో ఉంది.
సచివాలయ వ్యవస్థ ద్వారా కేవలం పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాలను వాలంటీర్లతో అందించే పని మాత్రమే జరిగేది.
సచివాలయ సిబ్బందికి గౌరవ ప్రదమైన ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపును కోరుతున్నారు. గతంలో వాలంటీర్లు చేసిన పనుల్ని ఉద్యోగులతో చేయించడంపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నా సచివాలయ ఉద్యోగుల సేవల్ని వినియోగించుకోవడం, ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయడంపై కూడా కసరత్తు జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న స్వరూపంలో సచివాలయ వ్యవస్థ కొనసాగకపోవచ్చు. వాటి స్వరూపం, విధుల కేటాయింపు, బాధ్యతలు, జవాబుదారీతనం విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *