సిరా న్యూస్,వరంగల్;
ఆదివాసీ నేత, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి సీతక్కపై కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క… ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్. జిల్లా పాలనలో ఇన్‌చార్జి మంత్రికి ఎంతో ప్రాధాన్యం ఉండటం, పైగా తమ వర్గానికే చెందిన నేత, పేదల కష్టనష్టాలు తెలిసిన సీతక్కకు ఇన్‌చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించడంపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతనిధులు అంతా ఆనందం వ్యక్తం చేశారు.వారి అంచనాలు, ఆశలకు తగ్గట్టే తొలినాళ్లలో అందుబాటులో ఉన్న మంత్రి సీతక్క…. ఏమైందో ఏమో ఈ మధ్య అటువైపే చూడటం మానేశారంటున్నారు. దాదాపు రెండు నెలలుగా జిల్లాలో మంత్రి అడుగు పెట్టకపోవడంతో చాలా పనులు పెండింగ్‌లో పడిపోయినట్లు చెబుతున్నారు.వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎవరూ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో లేరు. దీంతో ఉమ్మడి జిల్లా పాలనా వ్యవహారాలన్నీ ఇన్‌చార్జి మంత్రిగా సీతక్కే చూసుకోవాల్సి వుంది. ఐతే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలతోపాటు సొంత జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న సీతక్క… ఉమ్మడి ఆదిలాబాద్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ప్రజల సమస్యలపైనా పెద్దగా స్పందించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఉదాహరణగా ఇటీవల జరిగిన పలు ఉదంతాలను చూపుతున్నారు. రైతు ఆందోళనలు, సీజనల్ వ్యాధులు, ఆదివాసీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ముఖ్యనేతల జిల్లా పర్యటన సమయంలోనూ మంత్రి కనిపించకపోవడం సందేహాలకు కారణమవుతోంది. సీతక్కకు ఇన్‌చార్జి మంత్రి పదవి ఇష్టం లేదా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, ఇన్‌చార్జి మంత్రి సీతక్క అటువైపు చూడకపోవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.మరోవైపు ఏజెన్సీలో డెంగ్యూతోపాటు విష జ్వరాలు ప్రబలి గిరిజనం మంచం పట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఆదివాసీ బిడ్డగా, ఇన్‌చార్జి మంత్రిగా సీతక్క ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నా, మంత్రి మాత్రం ఆదిలాబాద్‌లో అడుగు పెట్టడం లేదని నిరసన వ్యక్తమవుతోంది. ఇక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయనే టాక్ వినిపిస్తోంది. ఇన్‌చార్జి మంత్రి ఆమోదం లేక కొత్త పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతోందంటున్నారు.ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద అధికారులు ప్రతిపాదన పంపుతున్నారు. వీటికి ఆమోదం తెలపాల్సిన ఇన్‌చార్జి మంత్రి రాకపోవడంతో ఏ పనీ ముందుకు కదలడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసమని 10 కోట్ల రూపాయల చొప్పున కేటాయించింది. కానీ, ఇన్‌చార్జి మంత్రి ఆమోదం లేక ఈ నిధులను వినియోగించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.ఇదే సమయంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అందడం లేదంటున్నారు. ఇవన్నీ అవ్వాలంటే ఇన్‌చార్జి మంత్రి సంతకం ఉండాల్సిందేనట.. కానీ, సీతక్క రాకపోవడంతో ఏ పనీ జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలే వాపోతున్నారు. మొత్తానికి మంత్రి సీతక్క కారణంగా జిల్లా అభివృద్ధి ఆగిపోతోందనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా, అందరికీ అందుబాటులో ఉన్న సీతక్క.. ఇప్పుడు మంత్రిగా ఆదివాసీల ప్రాంత అభివృద్ధిపై స్లో అయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి.. ఇప్పటికైనా మంత్రి సీతక్కపై వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పెడతారో? లేదో? చూడాలి.