సీటు నీదా…నాదా
సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా తెలుగుదేశం రాజకీయం బంగ్లా నీడలోనే నడిచేది. అటువంటి చోట తొలిసారి ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది. ధ్వనించడమే కాదు అశోక్ నాయకత్వాన్ని బహిరంగంగా సవాలై నిలిచింది. అక్కడకే పరిమితం కాలేదు. బస్తీమే సవాల్ అన్నట్లు సమీపంలోనే మరో కార్యాలయం కూడా తెరుచుకుంది. వీటన్నింటి రీత్యా ఎన్నడూ లేనంతగా టి.డి.పి. బలహీనంగా కనిపించడం అనివార్యమయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలలో టి.డి.పి. ఉనికే ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈ పరిణామాలు అన్నింటి వలనే టి.డి.పి.లో అభ్యర్థి ఎవరు అన్న అంశం తెరమీదకి వచ్చేటట్లు చేసింది. అందరూ చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. ఒక పక్క విజయనగరం పార్టీ ఇన్ చార్జ్ గా అధితి గజపతిరాజు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు నిలుస్తారని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. ఇంకో పక్క బి.సి. కార్డుతో మీసాల గీత టిక్కెట్ కోసం పోటీలో నిలిచారు. ఇలా ముగ్గురు టి.డి.పి. చిత్రంలో రక్తికట్టిస్తున్నారు. ఇంతకూ అభ్యర్ధి ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి ఓ ప్రశ్నే!? అధితి గజపతిరాజు భవిష్యత్ కి గ్యారంటీలో భాగంగా ఇంటింటి ప్రచారంలో షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అధితి గజపతిరాజు విజయనగరం అభ్యర్థి అని మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల కనక మహలక్ష్మీ తమ వార్డు పరిధిలో ఓ అవ్వకి పరిచయం చేశారు. ఆ క్రమంలోనే “ఎమ్మెల్యేగా నేనే పోటీచేస్తున్నా” అని ఆమె పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకోవడమే కాదు. గడిచిన నెల రోజులుగా రాజకీయంగా ఆమె యాక్టివేట్ అయ్యారు. పార్టీ కార్యక్రమంలోనే కాదు. ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనల్లో కూడా భాగస్థులవుతున్నారు. పార్టీసమావేశాలలో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. కొద్ది కాలం విరామం తరువాత ఆమె క్రియాశీలకంగా మారారు. దీంతో ఆమె ప్రకటించుకున్న విధంగా తానే అభ్యర్థి అన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు.సరిగ్గా ఈ ప్రకటనే ఇప్పుడు విజయనగరంలో సంచలనంగా మారింది. రేపటి ఎన్నికలలో ఎవరిని టిక్కెట్ వరిస్తుందో ఎవరూ చెప్పుకోలేని అయోమయ పరిస్థితి. అలాంటి స్థితిలో అధితి గజపతిరాజు చేసిన ప్రకటన రాజకీయంగా హెూరెత్తిస్తోంది. ఇన్ చార్జ్ లుగా కొనసాగుతున్న వారిలో అవసరమైతే కొంత మందిని మార్చుతామని చంద్రబాబు గతంలో ఇచ్చిన సంకేతాలు ఉండనే ఉన్నాయి. ఏ చోట అభ్యర్థి ఎవరో కనీస స్థాయిలో కూడా లీకులకు తావులేని పరిస్థితి కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం పొత్తు రాజకీయాలే అన్నది సుస్పష్టం.పొత్తులు ఇంకా పొడవకముందే, సీట్లు సర్దుబాటు కాకముందే తనకి తానుగా తానే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని చెప్పడం వైరల్ గా మారడం సహజం. అధిష్టానం నుంచి గానీ, అశోక్ గజపతిరాజు నుంచి గానీ ఎటువంటి ప్రకటనా ఇప్పటికైతే వెలువడలేదు. కాని, పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న అధితి స్వయం ప్రకటన అనేక ఆలోచనలకి, విశ్లేషణలకు తావిచ్చింది. ఇప్పటికీ తావిస్తూనే ఉంది. వాస్తవానికి ఆమెనే ఎన్నికల బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించుకుందా? లేక మరొక గొంతకు తావు లేకుండా నిరోధించే వ్యూహమా ? అన్నది ప్రస్తుతానికి ఊహాగానంగానే ఉంది. మొన్నటి ఎన్నికలలో అధితి గజపతిరాజు, అశోక్ గజతిరాజు ఓటిమి పాలుకావడంతో బంగ్లాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొంత మందిని దూరం పెట్టారు. అధితి నాయకత్వం ఇష్టం లేని వారు మీసాల గీతకి అండగా నిలిచారు. ఆమెతో నడుస్తున్నారు. ఆమె ప్రత్యేకంగా కార్యాలయం తెరిచారు. దీంతో మీసాల గీత తెరిచిన కార్యాలయంలో హడావిడి మొదలయ్యింది. ఈ క్రమంలోనే బి.సి. నినాదం పార్టీలో చాపకింద నీటిలా నడిపేందుకు పావులు కదిలాయి. అస్వస్థత నుంచి తేరుకున్న అశోక్ గజపతిరాజు పార్టీని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ప్రధాన సామాజిక వర్గాలకు పార్టీ కమిటీలకు సారధుల్ని చేశారు.