సిరా న్యూస్,హైదరాబాద్;
కరోనా తర్వాత ఫిటినెస్ విషయంలో అందరిలోనూ శ్రద్ద పెరిగింది. పల్లె, పట్టణాలు, చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేస్తున్నారు. జిమ్ముల్లో చెమటోడుస్తున్నారు. శరీరాకృతి, దేహదారుఢ్యం కోసం యువతీ యువకులు విపరీతంగా కష్టపడుతున్నారు. ఇలా జిమ్ముల్లో కష్టపడే వారిని కొందరు కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. గంటల తరబడి చెమటోడుస్తూ వ్యాయమం చేసే బదులు.. స్టెరాయిడ్లు వాడితే సులభంగా ప్యాక్స్ పెంచొచ్చంటూ మాయమాటలు చెబుతున్నారు. తక్కువ సమయంలో అనుకున్న ఫలితం వస్తుందని నమ్మబలికిస్తూ.. పలువురిని వలలో వేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. జిమ్ కు వెళ్లే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేసే ఖాసీం అనే వ్యక్తిని సికింద్రాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. అతని దగ్గరున్న ఇంజక్షన్లు, టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.జిమ్స్‌లో వర్కవుట్ చేసే యూత్ టార్గెట్‌గా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నాడు ఖాసీం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా కంటిన్యూ చేస్తున్నారు. ఇక సమాచారం అందడంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఖాసీం ఇంటిపై దాడి చేశారు. కార్డియక్ స్టిమ్యులేటింగ్ డ్రగ్ థెర్మిన్ ఇంజక్షన్లు, క్యాండీపేస్ -200 క్యాప్సుల్స్, పలు రకాల ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకోసుని ఖాసీంను కటకటాలకు పంపారు.అంతేకాదు భయంకరమైన విషయాలు వెల్లడించారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. ఈ ఇంజక్షన్లను హార్ట్ సర్జరీ, పలు రకాల సర్జరీల్లో రక్తం పలుచబడేందుకు వాడతారని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇలాంటి ఇంజక్షన్లు వాడడం ద్వారా గుండెపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని, తద్వారా మరణిస్తారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలే తప్ప సిక్స్ ప్యాక్ కోసం ఇలాంటి అడ్డదారులు ఎంచుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.
తిండి తింటేనే కండలొస్తాయి. మరి కండలు పెంచితే సరిపోద్దా.. కొవ్వు కరగాలంటే కష్టపడాలి.. వ్యాయామం చేయాలి. అప్పుడే బలానికి ఓ అర్ధంపర్ధం. కానీ ఆరోగ్యం కన్నా మజిల్ మేకింగ్‌పైనే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది యువత. సల్మాన్ ఖాన్‌లా గుండీలు తీసి సిక్స్ ప్యాక్ బిల్డప్ కొట్టాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లే ఇలా మోసపోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్ననారు. సో బీకేర్ ఫుల్.