సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉజ్వల పథకం లో భాగంగా ఆదివారం 100 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ కె ఆర్ కె కాలనీ, పరిసర ప్రాంతాలకు చెందిన 100 మంది నిరుపేద మహిళలకు గ్యాస్ సిలిండర్లతో పాటు గ్యాస్ స్టవ్ లను ఉచితంగా అందించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 2024 వరకు చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో సైతం ప్రచార రథాల ద్వారా క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. దీనివలన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో కనీస అవగాహన కూడా లేకుండా చేశారని విమర్శించారు. నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఎన్నికలు ఏవైనాప్పటికీ కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.